టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇంటికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లారు. ఈ ఆసక్తికర ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది. అర్హులైతే చాలు పార్టీలు చూడం, రాజకీయాలు చూడం, కులం చూడం, మతం చూడం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక సందర్భాల్లో చెప్పడం విన్నాం. ఇది అక్షరాలా నిజమని నిరూపించే ఘటన ఆవిష్కృతమైంది.
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయవాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పశ్చిమ నియోజకవర్గంలోని విద్యాధరపురంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య గడప తొక్కారు. రైతు భరోసా పథకంలో భాగంగా వర్ల రామయ్య సతీమణి జయప్రదకు రూ.13,500 లబ్ధి కలిగిందనే ధ్రువీకరణ పత్రాన్ని అందించేందుకు వెల్లంపల్లి వెళ్లడం విశేషం.
వెల్లంపల్లి వెళ్లిన సమయానికి వర్ల రామయ్య, ఆయన భార్య ఇంట్లోనే వున్నప్పటికీ బయటికి రాలేదు. సంక్షేమ పథకాలపై టీడీపీ నేతలు నిత్యం విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుండడం, స్వయాన టీడీపీ పొలిట్‌బ్యూరో కుటుంబ సభ్యులే లబ్ధిదారులు కావడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మొహం చూపేందుకు మనస్సాక్షి అంగీకరించనట్టుంది.
దీంతో రైతు భరోసా అందిందనే ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించేందుకు డ్రైవర్‌ను ఎమ్మెల్యే చెంతకు పంపారు. వర్ల రామయ్య భార్య జయప్రదకు రైతు భరోసాకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని వర్ల డ్రైవర్‌కు ఎమ్మెల్యే వెల్లంపల్లి అందజేశారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ అర్హత వుంటే నారా దేవాన్ష్‌కు కూడా అమ్మఒడి పథకం వర్తింపజేస్తామని చెప్పారు.