'అన్నా రాపాకన్నా'.. అంటూ జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ని ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్. కాపునేస్తం నిధుల విడుదల సందర్భంగా.. జిల్లాల నేతలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన.. వైసీపీ ఎమ్మెల్యేల పక్కనే కూర్చున్న రాపాకని కూడా అభిమానంతో అన్నా అని పిలిచారు. ఆ పిలుపుకి రాపాక పొంగిపోయారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా కూడా తనని గుర్తుంచుకుని మరీ అన్నా అని పిలవడంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. అది జగన్ అభిమానం, ఆయన సంస్కారం.
అయితే ఆ సంస్కారం, అభిమానం రెండూ పవన్ వద్ద లేవట. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ తనని అంత అభిమానంగా పిలవలేదని వాపోతున్నారు రాపాక వరప్రసాద్. జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత వైసీపీ నేతల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించిన రాపాక.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారట. అంతే కాదు.. తన నియోజకవర్గంలోని అనుచరులకు కూడా ఈ విషయాన్ని చెప్పి కంటతడి పెట్టుకున్నారట. అన్నా అన్న జగన్ పిలుపుతో ఆయన మరింత ఉప్పొంగిపోయారు.
వాస్తవానికి జగన్ పిలుపుతో జనసేనలో జరిగిన అవమానాలు రాపాకకు తెరలుతెరలుగా గుర్తొచ్చాయి. రాపాక విజయం తర్వాత అభినందనలు తెలిపేందుకు కూడా పవన్ కల్యాణ్ కాస్త టైమ్ తీసుకున్నారు. రెండుచోట్ల తాను ఓడిపోయి, పార్టీ మొత్తం తుడిచిపెట్టుకుపోయి ఒకే ఒక చోట తన పార్టీ అభ్యర్థి గెలవడంతో పవన్ ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. కనీసం నాదెండ్ల మనోహర్ కి ఇచ్చిన ప్రాధాన్యం కూడా ఎమ్మెల్యే రాపాకకు ఇచ్చేవారు కాదు. ఓ సందర్భంలో మీటింగ్ కి కాస్త ఆలస్యంగా వచ్చిన రాపాకను.. పవన్ ముందే నాదెండ్ల వెటకారమాడారు. అప్పుడు కూడా జనసేనాని కల్పించుకోలేదు. ఆ తర్వాత కూడా పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు రాపాక వరప్రసాద్.
జగన్ ఆ తరహా మనిషి కాదు. తనకంటే చిన్నవారిని కూడా ఎంతో మర్యాదగా, ఆప్యాయంగా పిలవడం ఆయనకు అలవాటు. అధికారుల్ని కూడా ఆప్యాయంగా అన్నా అని పలకరించే సీఎం బహుశా దేశంలో ఎవరూ ఉండరేమో. అలాంటి జగన్.. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కూడా రాపాకను గుర్తుంచుకుని మరీ వీడియో కాన్ఫరెన్స్ లో పలకరించారు. మీరు మాతోనే ఉన్నారన్న భరోసాని ఆయనకు కల్పించారు. పరోక్షంగా జిల్లా అధికారులకు కూడా ఓ ఇండికేషన్ ఇచ్చారు. దీంతో రాపాక జగన్ పై మరింత అభిమానం పెంచుకున్నారు, తన సన్నిహితుల వద్ద భావోద్వేగానికి గురయ్యారు.