హైదరాబాద్ లో ఇప్పుడు కరోనా విజృంభించేస్తోంది. టెస్ట్ లు చేస్తుంటే దాదాపు మూడింట ఒక వంతు మందికి పాజిటివ్ వచ్చేస్తోంది. మరి ఈ నెంబర్లలో ప్రయివేట్ ల్యాబ్ ల వివరాలు జోడిస్తున్నారో లేదో తెలియదు. ప్రజలు భయంతో పరిక్షలు చేయించుకుంటున్నారు. మరి ఇలా చేసిన వివరాలు అన్నీ ప్రభుత్వానికి వెళ్తున్నాయో లేదో కూడా తెలియదు.
మరోపక్క హైదరాబాద్ లోని ప్రఖ్యాత, కాస్త మంచి ట్రీట్ మెంట్ దొరుకుతుంది అనుకునే ఆసుపత్రులన్నీ రోగులతో నిండిపోయాయనీ, కొత్తగా రోగులను తీసుకోవడం లేదని వార్తలు వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని ఆసుపత్రులు ఒకటి రెండు రోజులు వెయిట్ చేసేలా వెయిటింగ్ లిస్టులు మెయింటయిన్ చేస్తున్నాయట.
ఇదిలా వుంటే కొన్ని ఆసుపత్రులు 'సర్వీస్' ను, 'ట్రీట్ మెంట్' ను డోర్ డెలవరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాస్త డబ్బున్నవారు, పలుకుబడి వున్నవారు ఈ విధమైన సర్వీసులు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ విధమైన సర్వీసులకు రోజుకు పాతిక వేల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం నర్సింగ్ సర్వీసులకు మాత్రమే. మందులకు, ఆక్సిజన్ ఏర్పాట్లకు, డాక్టర్ ఫోన్ అడ్వయిజ్ కు అదనంగా వుంటుందని తెలుస్తోంది.
మరోపక్క భీమా కంపెనీలు ఇదే అదనంగా పాలసీలు విపరీతంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. పాత పాలసీలను టాప్ అప్ పేరిట పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ వద్దాం అనుకున్నవారిని, ఇక్కడి వారు రావద్దు అని హెచ్చరించే పరిస్థితి కనిపిస్తోంది. చిత్రమేమిటంటే ఒకప్పుడు ఇక్కడి జనాలను విజయవాడ, కర్నూలు వెళ్లొద్దు అన్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.
ఇక్కడ వాళ్లు ఆంధ్రకు వెళ్లాలంటే పాస్ కావాలి. ఆంధ్ర జనాలు ఇక్కడకు రావాలంటే అక్కరలేదు. ఇటీవల లాక్ డౌన్ సడలించాక ఆంధ్రలో చిక్కుకుపోయిన అందరూ బోలోమంటూ వచ్చేసారు. ఇప్పుడు మళ్లీ వెనక్కు ఎలా వెళ్లాలో తెలియక కిందా మీదా అవుతున్నారు.