దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్నారు మహాకవి గురజాడ. ఆ స్ఫూర్తి పాలకుల్లో కొరవడినప్పుడు ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అస్తిత్వ పోరాటాలు పురుడు పోసుకుంటాయి. ఆంధ్రప్రదేశ్ అంటే ఆ 29 గ్రామాలు కాదని, వాటితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలనే నినాదం ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్‌ను ఇప్పుడు ఆత్మగౌరవ, అస్తిత్వానికి సంబంధించి అంశాలు కదిలిస్తున్నాయి.
రాజధాని అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదని, మూడు ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి అనే నినాదం ఊపందుకుంది. అదే విశాఖ గర్జన అయ్యింది. రెండు రోజుల్లో తిరుపతి ఆత్మగౌరవ మహాప్రదర్శన కానుంది. సీమ పౌరుషాన్ని చాటేందుకు తిరుపతి మహా ప్రదర్శన వేదిక కానుంది. కర్నూలు న్యాయ రాజధాని రాయలసీమ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమంటూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సీమ ఉద్యమ అంకురార్పణకు శ్రీకారం చుట్టారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత సీమ ప్రజల ఆకాంక్షలను ఎలుగెత్తి చాటడానికి తిరుపతి నియోజకవర్గాన్ని ఆయన సమాయత్తం చేస్తున్నారు. ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నియోజకవర్గ ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నారు. గడపగడపకూ వెళ్లి వికేంద్రీకరణకు మద్దతుగా నిలవాలని ఆహ్వనిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు కృష్ణాపురం ఠాణా నుంచి తిరుపతి మున్సిపల్ కార్యాలయం వరకూ మహాప్రదర్శన ఎమ్మెల్యే నేతృత్వంలో చేయనున్నారు. అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే నినాదంతో ముందుకు సాగనున్నారు. వామపక్ష తీవ్ర ఉద్యమాలతో ఒకప్పుడు గాఢమైన సంబంధం ఉన్న కరుణాకరరెడ్డి నేతృత్వంలో సీమ ఉద్యమం ఆవిర్భవించడం శుభపరిణామం.
అందుకే అందరి దృష్టి తిరుపతిలో నిర్వహించే మహా ప్రదర్శనపై పడింది. పాత తరానికి, ఇవాళ్టి తరానికి వారధిగా భూమన కరుణాకరరెడ్డి నిలుస్తారు. 1975లో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి, దేశంలోనే అతి చిన్న వయసులో జైలు ఊచలను ముద్దాడిన ఘనత కరుణాకర్‌ది. అలాంటి నాయకుడు సీమ వికేంద్రీకరణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తుండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వెయ్యి మైళ్ల ప్రయాణానికైనా మొదటి అడుగే కీలకం. ఆ అడుగు తిరుపతిలో పడనుంది. తిరుపతిలో మొదలై.. ఇంతింతై అన్నట్టు రాయలసీమ వ్యాప్తంగా న్యాయ రాజధాని కోసం పోరాటాలు ఊపందుకునే వాతావరణం నెలకుంది.