తమ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నుంచి నాయకులు తమ పార్టీలోకి వచ్చి చేరితే ఎవరైనా సరే దాన్ని తమ ఘనతగా ప్రచారం చేసుకుంటారు. తమ పార్టీకి విపరీతంగా ఆదరణ పెరుగుతోందని.. అందుకే అధికారంలో ఉన్న ప్రత్యర్థి పార్టీని కూడా వదిలిపెట్టి నాయకులు పోలోమని వచ్చి తమతో జతకడుతున్నారని చాటుకుంటారు. నాయకులు పార్టీ మారడం వెనుక ఇలాంటి అభిప్రాయం కలగడం సహజమే.
అయితే అదంతా నిన్నటి సంగతి ఇవాళ రాజకీయాలు మొత్తం కలుషితం అయిపోయాయి. వలసలు, ఫిరాయింపులు అనేవి పార్టీల ఆదరణకు కాదు కదా.. వారి బేరసారాల వ్యాపార తెలివితేటలకు నైపుణ్యాలకు నిదర్శనం గా మారిపోయాయి. హైదరాబాదులో కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముగ్గురు వ్యక్తులు కోట్లాది రూపాయల డబ్బుతో ప్రయత్నించారని బయటకు రావడం… ఈ నాయకుల సంత బేరాల వ్యవహారాన్ని రచ్చకీడ్చి.. చీదరపుట్టిస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముగ్గురు వ్యక్తులు.. డబ్బు కట్టలతో సహా వచ్చి హైదరాబాదు శివారులలోని ఒక ఫామ్ హౌస్ లో రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయారు. వారు ఏ పార్టీ తరఫున బేరాలు చేయడానికి వచ్చారనే సంగతి ప్రస్తుతానికి బయటకు రాలేదు. కానీ వారి వ్యవహారం, వాతావరణం బట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ సంత బేరాలు సాగుతున్నట్టుగా అనుమానాలు పుట్టేలా ఉంది. ఫరీదాబాద్ కు చెందిన రామచంద్ర భారతి అనే వ్యక్తి, తిరుపతికి చెందిన సింహయాజి అనే స్వామీజీ, హైదరాబాదుకు చెందిన నందకుమార్ ఈ పట్టుబడిన వారిలో ఉన్నారు. వారి వెనుక సూత్రధారులు ఎవరు అనే విషయంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీ నుంచి వలసలు వస్తే తమ ప్రతిష్ట పెరుగుతుందనే పార్టీల యావ ఇలాంటి బేరసారాలకు ప్రధాన కారణం. ఇటీవల బిజెపి నుంచి కొందరు నాయకులు తెరాస లోకి వెళ్ళారు. దీనికి జవాబుగా.. తెరాస నుంచి ఏకంగా ఎమ్మెల్యేలకు గేలం వేయడానికి బిజెపి ప్రయత్నించి ఉంటుందని అనుకోవచ్చు.
అసలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు అప్పగించడం ద్వారా ప్రలోభపెట్టి కాంగ్రెస్ నుంచి ఫిరాయింపజేసి తమ పార్టీలో చేర్చుకున్నారని బిజెపి మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కొత్తగా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం వలవేయడం చర్చనీయాంశంగా మారుతోంది.
గతంలో ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి నోట్ల కట్టలు కానుకగా అందించబోయి అప్పట్లో తెలుగుదేశంలో ఉన్న రేవంత్ రెడ్డి జైలు పాలయ్యాడు. ఆయన సహా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికీ కేసు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి అనుభవం దృష్ట్యా ప్రస్తుతం అదే రేవంత్ రెడ్డి సారధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అలాంటి సాహసం చేస్తుందిని అనుకోలేము. ఇక అందరూ చూపులు బిజెపి సూత్రధారి పాత్ర మీదనే ఉన్నాయి.
టీఆర్ఎస్ నిందలు, ఈ ముసుగులో టీఆర్ఎస్ పార్టీనే డ్రామా ఆడుతోందనే ప్రతినిందలు చాలా సహజంగా వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు ఏం తేలుస్తారో వేచి చూడాలి.