నేతల అధికార దర్పాలకేనా ఈ వ్యవస్థ?

తను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం పరపతిని ఉపయోగించి అమిత్‌ షాను అరెస్టు చేయించారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షా అదే పరపతిని ఉపయోగించి అదే చిదంబరం చేత ఊచలు లెక్కబెట్టిస్తున్నారు!…

తను కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం పరపతిని ఉపయోగించి అమిత్‌ షాను అరెస్టు చేయించారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌ షా అదే పరపతిని ఉపయోగించి అదే చిదంబరం చేత ఊచలు లెక్కబెట్టిస్తున్నారు! అనే అభిప్రాయం సోషల్‌ మీడియా నుంచి ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. కేంద్ర మాజీమంత్రి, యూపీఏ హయాంలో ఒక వెలుగు వెలిగిన చిదంబరం అరెస్టు కావడంపై ఈ తరహా అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. వినడానికి ఇదో కర్మ సిద్ధాంతంలా ఉన్నా. ఇది మన వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు ఒక వెక్కిరింపు అనే అభిప్రాయానికీ అవకాశం ఉంది.

నేతలు తమ రాజకీయ కక్షసాధింపు చర్యలకు, రాజకీయ ప్రయోజనాలకు కీలకమైన వ్యవస్థలను ఉపయోగించుకుంటూ ఉంటే అంతకన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. గతంలో చిదంబరం ఇదేపని చేసి ఉన్నా, ఇప్పుడు అమిత్‌ షా అదే పని చేస్తున్నా.. అంతకన్నా దారుణాలు ఉండవు. యావత్‌ భారతదేశాన్నీ ఈ చర్యలు వెక్కిరిస్తున్నట్టే. అమిత్‌ షాను చిదంబరం, చిందబరాన్ని అమిత్‌ షా జైల్లో పెట్టడం, రేపు వీరి వారసులు మళ్లీ రాజకీయాల్లోకి ఒకర్నొకరు జైల్లలో పెట్టుకోవడానికి కాదు ఈ వ్యవస్థ ఉన్నది.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ ప్రయోజనాల కోసం, నరేంద్రమోడీని దెబ్బతీయడానికి అమిత్‌ షాను చిదంబరం జైల్లో పెట్టించలేదు. పైకి అయితే అలాంటి రీజన్లు కనపడవు. సొహ్రబుద్ధీన్‌, అతడి భార్య ఎన్‌కౌంటర్‌కు ఆదేశాలు ఇచ్చారు అనే అభియోగాలు మోపి సీబీఐ ద్వారా అమిత్‌ షాను అప్పుడు అరెస్టు చేయించారు. మూడునెలలు జైల్లో పెట్టారు. ఒకవేళ ఆ అభియోగాలను రుజువు చేసిఉంటే అమిత్‌ షా ఇప్పుడు కేంద్ర హోంమంత్రి అయ్యేవారు కాదేమో. అమిత్‌ షాను నిందితుడిగా నిలిపారు, కానీ దోషిగా నిరూపించలేకపోయారు. దీంతో అమిత్‌ షా బయటకు వచ్చారు. రాజకీయంగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు.

ఇక ఇప్పుడు చిదంబరం పరిస్థితి ఏమవుతుంది? ఈయనపై మోపిన అభియోగాలను నిరూపించగలరా? లేక అమిత్‌ షాను మూడునెలల పాటు జైల్లో పెట్టారు కాబట్టి, చిదంబరాన్ని నాలుగు నెలలు జైల్లో పెట్టి విడుదల చేస్తారా? అంతటితో కక్షసాధింపు పూర్తి అయ్యిందని కథ ముగిసిందంటారా? అన్నింటినీ ప్రజలు  గమనిస్తూనే ఉన్నారని నేతలు, వ్యవస్థ గమనించాలి. లేకపోతే కొంతమంది వ్యక్తులు నడిపించే ఈ వ్యవస్థపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోతారు!
-ఎల్‌.విజయలక్ష్మి

ఏపీ రాజధానిని వైఎస్ జగన్ మారుస్తారా?