జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా ఎంత అప్రతిష్టకు గురిచేయాలో అంతా చేశారు టీడీపీ నాయకులు. “నాకు ఈ రాజకీయాలు వద్దు” అనే స్థాయికి ఎన్టీఆర్ ను తీసుకొచ్చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లో ఓ పద్ధతి ప్రకారం కొన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే టీడీపీ ఘోరంగా ఓడిపోయిందో అప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ అంశం తెరపైకి వచ్చింది.
అయితే ఈసారి కూడా టీడీపీ నేతలు తగ్గడంలేదు, ఎన్టీఆర్ ను ఎంత దిగజార్చాలో అంత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య చిన్నల్లుడు భరత్ కు కూడా లోకువైపోయాడు ఎన్టీఆర్. అసలు జూనియర్ కు రాజకీయాలు ఎందుకు అనే అర్థంవచ్చేలా మాట్లాడారు భరత్. ఒకదశలో ఎన్టీఆర్ మాకు అవసరం లేదని కుండబద్దలుకొట్టారు.
“ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి మంచి జరుగుతుందని నేను అనుకోవడం లేదు. మాకు జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు. ఎందుకు అవసరం చెప్పండి. మేం బాగానే ఉన్నాం కదా. అసలు ఎన్టీఆర్ ను మేం ఎందుకు కోరుకుంటాం. ఇప్పటివరకు మేం నడిపిన పార్టీ, మా నాయకులు పనికిరాకుండా ఉన్నారా? అలాంటిదేం లేనప్పుడు ఎన్టీఆర్ ను మేం ఎందుకు కోరుకుంటాం.”
ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ ను కలుపుకొని పోవాల్సిన బాధ్యత ఉంది కదా అనే ప్రశ్నకు అలాంటిదేం లేదన్నారు భరత్. ఎన్టీఆర్ కు చాలామంది పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఉన్నారని.. జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్లలో ఒకరని, ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఎన్టీఆర్ స్టార్ డమ్ టీడీపీకి అక్కర్లేదనేది భరత్ భావన.
“ఎన్టీఆర్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే, మా నాయకుడ్ని వచ్చి కలవాలి. ఎన్టీఆర్ వస్తే పార్టీకి బాగుంటుందని మా నాయకుడు కూడా ఫీలవ్వాలి. ఆ నిర్ణయాన్ని వాళ్లిద్దరూ కలిసి తీసుకోవాలి. నా వరకు మాత్రం ఎన్టీఆర్ పార్టీకి అవసరమని నేను అనుకోవడం లేదు. ఆయనుంటేనే పార్టీ బాగుంటుందని నేను అనుకోవడం లేదు. మా ఆలోచనలతో మేమే పార్టీని నిర్మించుకోగలం. ఎన్టీఆర్ అవసరం లేదు.”
ఓవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులన్నీ ఎన్టీఆర్ రావాలంటూ పట్టుబడుతుంటే, మరోవైపు బాలకృష్ణ వర్గం మాత్రం ఇలా ఎన్టీఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇలా వ్యతిరేకించే వర్గానికే చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ వస్తే, లోకేష్ పప్పులుడకవనే విషయం బాబుకు బాగా తెలుసు. అందుకే ఇలా తన వర్గంతో ఎన్టీఆర్ పై ఎప్పటికప్పుడు విమర్శలు చేయిస్తూ, అతడ్ని పార్టీకి దూరం చేస్తున్నారు.