ప్రవచనకర్తగా చాగంటి కోటేశ్వరరావుకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఒకవైపు ఉద్యోగిగా తన విధుల్లో కొనసాగుతూ లాభాపేక్ష లేకుండా ఆయన హైందవ ప్రవచనాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆంధ్ర మహాభాగవతం గురించి ఆయన చెబుతూ ఉంటే ఆధ్యాత్మికత కలిగిన వారికి ఎంతో ఇంపుగా ఉంటుంది. టీవీల్లో చాగంటి ప్రవచనాలకు బీభత్సమైన క్రేజ్ ఉంది. అలాగే ఆయన వివిధ ప్రాంతాలకు వెళ్లి కూడా ప్రవచనాలు చేస్తూ ఉంటారు.
ఇలాంటి నేపథ్యంలో అందుకు సంబంధించిన వీడియోలను డీవీడీలుగా మార్చి అమ్మే ప్రక్రియ కూడా సాగుతూ ఉంది. మామూలుగా ఈ వ్యవహారాన్ని చాగంటికి సంబంధించిన ట్రస్టు చూసుకుంటుంది. అది కూడా లాభాపేక్ష లేకుండానే సాగిస్తూ ఉన్నారట. అయితే టీటీడీ ఈ వ్యవహారంలోనూ లాభాన్ని చూసుకుంది.
గతంలో ఎస్వీబీసీ చైర్మన్‌గా రాఘవేంద్రరావు ఉన్న సమయంలో ఇందుకు సంబంధించిన వ్యవహారం ఒకటి నడిచింది. అది వివాదంగా నిలిచింది. ఎస్వీబీసీ కోసం చాగంటి కోటేశ్వరరావు చేసిన ప్రవచనాలను డీవీవీలుగా మార్చి తిరుమలకు వచ్చే భక్తులకు అమ్మాలనే ఆలోచన చేశారు. దానికోసం అంటూ ఇరవై లక్షల రూపాయల బడ్జెట్ కూడా కేటాయించారట.
అయితే అందులో కూడా చాగంటి రూపాయి కూడా తీసుకోలేదు. డీవీడీలు, వాటి మార్కెటింగ్ కోసమని ఆ నిధులు కేటాయించారు. అయితే టీటీడీ వ్యవహారాలు ఎప్పుడూ ఒకలా ఉండవు కదా. తీరా ఇరవై లక్షల బడ్జెట్ కేటాయించి, డీవీడీలు తయారు చేయించాకా కథ మారింది. డీవీడీలకు కాలం చెల్లిపోయిందంటూ ఒక అధికారి వాటి అమ్మకాలను స్టాప్ చేయించారట!
ఇలానే ఉంటారు మేధావులు. డీవీడీలు ప్రస్తుతం విరివిగా వాడకంలో లేకపోవచ్చు. అయితే ప్రవచనాల మీద ఆసక్తి ఉన్నవారు వాటిని కొనుగోలు చేసి ఉపయోగించుకుంటారు కదా. డీవీడీలకు కాలం చెల్లిపోయిందంటూ తయారు చేయించిన వాటిని ఒక రూమ్‌లోకి వేసి పడేశారు. కొన్ని నెలలకు సహజంగానే వాటి నాణ్యత దెబ్బతింది. ఇలా టీటీడీకి ఇరవై లక్షల రూపాయల వరకూ నష్టం!
అదే బాధ్యతను చాగంటికి వదిలిపెట్టి ఉంటే ఆయన ట్రస్టు ద్వారా ఆయనేదో చేసుకునేవారు. ఆయననూ ఆయన పని చేసుకోనివ్వక టీటీడీ ధనాన్ని వథా చేసిన వ్యవహారం గత బోర్డు హయాంలో చోటు చేసుకుంది. ఇప్పుడు టీటీడీ బోర్డు, ఎస్వీబీసీ చైర్మన్ ఈ విషయాల్లో ఏం చేస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది.
గతంలో ఎస్వీబీసీ చైర్మన్ మీదా బోలోడన్ని ఆరోపణలు వచ్చాయి. అధికారులూ ఆడింది ఆటగా సాగింది. ఈ పరిణామాల్లో కొత్త బోర్డు, కొత్త ఎస్వీబీసీ చైర్మన్ ఇలాంటి వివాదాలను ఎలా డీల్ చేస్తారో!