చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వైసీపీ మంత్రులకు అలవాటుగా మారుతున్నట్టు కనిపిస్తోంది. అప్పట్లో రేషన్ డీలర్లు రోడ్డెక్కి నిరసనలు చేస్తే.. రోజుల తరబడి వేచిచూసి ఆ తర్వాత నింపాదిగా వారికో హామీ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నాల విషయంలో కూడా నాన్చి, నాన్చి నిర్ణయాలు తీసుకున్నారు. ఇసుక వ్యవహారంలో ఇంకా విమర్శలు కాచుకుంటూనే ఉన్నారు. అమరావతిపై నోరుజారాక.. తీరిగ్గా తమ మాటలు వక్రీకరించారంటూ సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ-కేవైసీ.
ఇప్పటికే జరగాల్సిన రాద్ధాంతం జరిగిపోయింది. 5 రోజులుగా ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్న వేళ.. అకస్మాత్తుగా ఈ-కేవైసీ అవసరం లేదు, అది నిరంతర ప్రక్రియ అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. దీంతో అటు ప్రతిపక్షాల పంతం కూడా నెరవేరినట్టయింది. ఈ-కేవైసీ విషయంలో లోకేష్ ట్వీట్లకు భయపడి ప్రభుత్వం నిర్ణయం మార్చుకుందని టీడీపీ ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే వైసీపీ నిర్ణయాలను టీడీపీ చాలావరకు తమకు అనుకూలంగా ప్రొజెక్ట్ చేసుకుంది, చేసుకుంటుంది కూడా.
ఈ-కేవైసీ పేరుతో రేషన్ కార్డులో ఆధార్ నెంబర్, వేలిముద్రల వివరాలను మరోసారి అప్ డేట్ చేయాలనుకోవడం మంచి ప్రయత్నమే. ఇలాచేస్తే నకిలీ రేషన్ కార్డులను సగానికి సగం ఏరివేయొచ్చు. అయితే రాష్ట్రంలో 90శాతం మంది డీలర్లు ఈ అదనపు భారం మోయలేక.. కార్డుదారుల్ని మీసేవా కేంద్రాలవైపు మళ్లించారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ ఈకేవైసీ చేయించుకోవాలంటూ తిప్పిపంపారు. దీంతో సమస్య పెద్దదైంది.
జగన్ సర్కారు పేదలకార్డుల్ని తీసేస్తోందనే పుకారు మొదలైంది. డెడ్ లైన్ లోపల ఈకేవైసీ చేయించుకోకపోతే రేషన్ కార్డులు చెల్లవనే ప్రచారం జనాల్లోకి బాగా వెళ్లింది. అసలు ఈకేవైసీ వంటి ప్రక్రియలకు డెడ్ లైన్ పెట్టడం పెద్ద తప్పు. అందులోనూ రేషన్ డీలర్ల దగ్గర పూర్తయ్యేపని.. మీసేవా కేంద్రాలవైపు మళ్లినా అధికారులు సమీక్షించకపోవడం మరోతప్పు. ఇలా తప్పుమీద తప్పు జరిగేలోపు జనంలోకి ఓ తప్పుడు అభిప్రాయం వెళ్లింది.
గడువు పెంచుతున్నాం, పిల్లలకు స్కూల్స్ లోనే ఈకేవైసీ చేస్తామంటూ ప్రకటించినా కూడా పెద్దగా ఫలితం లేకపోయింది. గడువు పెంచినా వచ్చేనెల రేషన్ సరుకులు అందవేమోనని ప్రజలు అనుమానించారు. రాత్రీ పగలు మీసేవ కేంద్రాల ముందు బారులు తీరారు. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఈకేవైసీకి గడువులేదు, ఎవరి రేషన్ కార్డులు తీసివేయం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది.
అయితే ఇప్పటికే దీనివల్ల కొంత నష్టం జరిగిందనేది వాస్తవం. ముఖ్యంగా పేదల్ని ప్రభావితం చేసే ఇలాంటి నిర్ణయాలు తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తే ప్రభుత్వ పెద్దలకు నష్టమేమీ లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే.. ప్రతిపక్షాలు ప్రజల్ని రెచ్చగొట్టేలోపే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమయ్యేది ఇలాంటి చిన్నచిన్న లోపాల నుంచే అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది.