ముంబయ్‌లో ఓ అమ్మాయిని ఐటం అని పిలిచినందుకు కోర్టు శిక్ష విధించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మహిళను స్టెప్నీగా అభివర్ణించిన జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ఎన్నేళ్లు శిక్ష పడుతుందంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ముంబయ్‌కి చెందిన 16 ఏళ్ల అమ్మాయి తనను 25 ఏళ్ల యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడని 2015లో కేసు పెట్టింది. సదరు యువకుడు తన జుట్టు పట్టుకుని ఐటమ్ అంటూ వేధించాడని ప్రత్యేక పోక్సో కోర్టులో అమ్మాయి న్యాయమూర్తి ఎదుట వాపోయింది. ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌జే అన్సారీ ఈ విషయంపై సీరియస్‌గా స్పందించారు.
అమ్మాయిలను వేధించడానికి అబ్బాయిలు ఇలాంటి భాషను వాడుతారని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మాయిలను వేధించే రోడ్ సైడ్ రోమియోలకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే అన్నారు. నిందితుడిపై దయ చూపే ప్రసక్తే లేదని, ఏడాదిన్నర జైలు శిక్ష విధించడం చర్చనీయాంశమైంది. ఈ కేసును పవన్‌కల్యాణ్‌కు వర్తింపజేస్తూ, వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు సెటైర్స్ విసురుతున్నారు.
ఇటీవల మహిళలను ఉద్దేశించి స్టెప్నీలని పరుష పదజాలాన్ని పవన్ ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇదే విషయమై మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ ఏపీ మహిళా కమిషన్ పవన్‌కల్యాణ్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పవన్‌కు ఏడాదిన్నర, లేక రెండేళ్లా? అంత కంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడుతుందా? అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రశ్నించడం గమనార్హం. ఇందుకు సంబంధంచి పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.