ఆయన ఇంటి పేరు కూన. కానీ టీడీపీకి అన్నీ ఆయనే. మేనమామ తమ్మినేని సీతారామ్ చాటు మేనల్లుడిలా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీకాకుళం జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ కూన రవికుమార్ తరువాత కాలంలో సొంత జెండా ఎత్తారు. సీతారామ్ టీడీపీని వీడిపోవడంతో కూన ఆ పార్టీకి పెద్ద అయ్యారు.
ఇదిలా ఉంటే మామా అల్లుళ్ల మధ్య రాజకీయ సమరం, వ్యక్తిగత సమరాన్ని దాటి ముందుకు పోయింది. ఈ నేపధ్యంలో కూన రవికుమార్ మీద 2019 లో తమ్మినేని గెలవడం స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఇద్దరి మధ్య మరింతగా రాజకీయ రచ్చ ముదిరింది. ఈ నేపధ్యంలో కూన రవికుమార్ ఆ మధ్య స్పీకర్ మీద చేసిన కొన్ని కామెంట్స్ హద్దులు దాటాయి.
దాంతో ఆయన మీద శాసనసభ ప్రివిలేజ్ కమిటీ యాక్షన్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే ఆయన వివరణ కోరినా కూన నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ప్రివిలేజ్ కమిటీ కఠిన నిర్ణయమే తీసుకుంటుంది అంటున్నారు.
మొత్తానికి ఆముదాలవలసకు చెందిన ఈ రాజకీయ కుటుంబంలో ఇపుడు యాక్షన్ ఎపిసోడ్ మంటలు రేపేలాగానే ఉంది. కూన మీద తీసుకునే చర్యలను బట్టి టీడీపీ రియాక్షన్ ఉంటుందని అంటున్నారు. మొత్తానికి మామతో పెట్టుకున్న కూన పాలిటిక్స్ ఏవైపునకు సాగుతుందో చూడాల్సిందే.