సీనియర్ నటి, టీడీపీ మాజీ నేత దివ్యవాణి బీజేపీలో చేరనున్నారు. అది కూడా తెలంగాణ బీజేపీలో చేరనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీ టీడీపీలో బలమైన గళం వినిపించిన సంగతి తెలిసిందే. అయితే పార్టీలో కష్టపడి పని చేసిన ఆమెకు చివరికి అన్యాయమే జరిగింది. టీడీపీ నుంచి బయటికొస్తూ… ఆ పార్టీలో ఎలాంటి వారికి పదవులు వస్తాయో షాకింగ్ విషయాలు చెప్పిన సంగతి తెలిసిందే.
టీడీపీ నుంచి బయటికొచ్చిన ఆమె వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఆమె వైసీపీ అధినేత, ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసలు కురిపించారు. కానీ ఆమె చూపు కమలం వైపు ఉందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. బీజేపీ ఎంపీ లక్ష్మిణ్ను దివ్యవాణి మర్యాదపూర్వకంగా కలవడంతో ఆమె చేరికపై చర్చకు తెరలేచింది. ఇంతకాలం ఏపీ టీడీపీలో కీలకంగా వ్యవహరించిన ఆమె తెలంగాణ బీజేపీ నేతలను కలవడం విశేషం.
దివ్యవాణి ఏపీకి చెందిన నాయకురాలు. పైగా ఆమె మతం రీత్యా క్రిస్టియన్. అసలే బీజేపీ హిందుత్వ పార్టీగా ముద్రపడింది. అలాంటి పార్టీలో దివ్యవాణి చేరాలనుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీకి చెందిన జీవిత తెలంగాణలో బీజేపీలో యాక్టీవ్‌గా తిరుగుతున్నారు. రానున్న ఎన్నికల్లో టికెట్ ఇస్తే పోటీ చేయాలని జీవిత ఉత్సాహం చూపుతున్నారు.
దివ్యవాణి చేరికతో ఆ పార్టీకి సినీ గ్లామర్ పెరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే లేడీ అమితాబ్ విజయశాంతి బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే.