రెండున్న‌ర నెల‌ల‌కే మొహ‌మెత్తింది!

తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయంగా అటూ, ఇటూ మార్పుల‌కు ఈ ఎన్నిక కార‌ణ‌మైంది. తాజాగా బీజేపీకి ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ఆగ‌స్టులో…

తెలంగాణ‌లో మునుగోడు ఉప ఎన్నిక ఆస‌క్తిక‌రంగా మారింది. రాజ‌కీయంగా అటూ, ఇటూ మార్పుల‌కు ఈ ఎన్నిక కార‌ణ‌మైంది. తాజాగా బీజేపీకి ఆ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ ఝ‌ల‌క్ ఇచ్చారు. ఈ ఏడాదిలో ఆగ‌స్టులో కాంగ్రెస్‌కు దాసోజు శ్ర‌వ‌ణ్ గుడ్‌బై చెప్పి, బీజేపీలో చేరారు. కాంగ్రెస్‌ను వీడే ముందు ఆ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బానిస బతుకు బ‌త‌క‌డం ఇష్టం లేకే కాంగ్రెస్‌ను వీడుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

రెండున్న‌ర నెల‌ల‌కే బీజేపీపై ఆయ‌న‌కు మోహం పోయింది. బీజేపీని వీడే ముందు ఆ పార్టీపై బండ వేశాడు. ఈ మేర‌కు ఆయ‌న టీబీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కి రాజీనామా లేఖ పంపారు. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాలు చేస్తామ‌ని చెప్పి, మునుగోడులో మందు, మాంసం, నోట్ల క‌ట్ట‌లు పంచ‌డం ద్వారా మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీ గెలవాల‌నే తీరుకు నిర‌స‌న‌గా రాజీనామా చేసిన‌ట్టు శ్ర‌వ‌ణ్ పేర్కొన్నారు. 

ఎన్నో ఆశ‌యాల‌తో బీజేపీలో చేరిన‌ప్ప‌టికీ, అందుకు త‌గ్గ వేదిక ఆ పార్టీలో లేద‌ని త్వ‌ర‌గా గ్ర‌హించాన‌న్నారు. ఇదిలా వుండ‌గా ఆయ‌న తిరిగి టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారు. మొద‌ట‌గా ఆయ‌న ప్ర‌జారాజ్యం నుంచి రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌కంగా ప‌ని చేశారు. 

కేసీఆర్‌తో స‌న్నిహితంగా మెలిగారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ఆయ‌న ఇబ్బందిగా ఫీల‌య్యారు. దీంతో బీజేపీలో చేరారు. ఆ పార్టీని కూడా వీడారు. ఇవాళ సాయంత్రం మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేర‌నున్నారు.