అధికారం కోల్పోయాకా పలువురు తెలుగుదేశం నేతలు పరారీ వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ముందస్తు బెయిల్ ప్రయత్నాలు, పోలీసులకు దొరకకుండా పరార్ కావడం వారికి రొటీన్ వ్యవహారాలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులైన ఒక సీనియర్ జర్నలిస్టుతో మొదలు.. కోడెల కుటుంబీకులు, గరుడపురాణం శివాజీ.. వంటి వాళ్లంతా పరార్ అయిన జాబితాలో ఉన్న వాళ్లే. తమపై నమోదైన అభియోగాలపై విచారణలకు ముందుకు రాకుండా వీళ్లు పరార్ అయ్యారు.
ఈ పరారీ బ్యాచ్ లో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తమ్ముడు కూడా చేరారు. ప్రభుత్వ ఆస్తులపై దాడి కేసులో యనమల కృష్ణుడుపై కేసులు నమోదయ్యాయి. ఆయన మీద, ఆయన అనుచరుల మీద అందుకు సంబంధించి కేసులు నమోదు కాగా.. వాటి విచారణ నుంచి తప్పించుకునేందుకు యనమల కృష్ణుడు అనుచరులతో సహా పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
యనమల రామకృష్ణుడు కుటుంబానికి తునిలో వరస ఓటములు తప్పడంలేదు. అయితే ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో ఓడిపోయినా వీరిదే రాజ్యం అయ్యింది. ఈసారి టీడీపీ కూడా ఓడిపోవడంతో.. నియోజకవర్గ స్థాయిలో యనమల కృష్ణుడు గతంలో సాగించిన దాష్టీకాలన్నీ చర్చనీయాంశంగా మారాయి. ఇదే సమయంలో అన్నా క్యాంటీన్ పై దాడి చేసి, అద్దాలు ధ్వంసం చేసిన వ్యవహారంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోయనమల సోదరుడు పరారీలో ఉన్నట్టుగా పోలీసులు ప్రకటించారు!