పార్టీ బాగుంటే కొడుకు కూడా బాగుంటాడు. కొడుకు మాత్రమే బాగుండాలని కోరుకుంటే, పార్టీ సర్వనాశనం. ఈ చిన్న లాజిక్ ఎందుకో మిస్ అయ్యారు చంద్రబాబు. కొడుకు కోసం పార్టీని పణంగా పెడుతున్నారు. చరిత్రలోనే ఇప్పటివరకూ ఎరుగని పతనాన్ని చవిచూసింది టీడీపీ.
ఇంకా లోకేష్ కోసం పాకులాడితే సీనియర్లు ఒక్కొక్కరే చేజారడం మినహా బాగుపడేది మాత్రం ఏమీ ఉండదు. అయినా కూడా కొడుకుపై పిచ్చి ప్రేమతో పార్టీని చంపేస్తున్నారు బాబు. లోకేష్ ను పార్టీకి పెద్ద దిక్కుగా చేసేందుకు బాబు చేస్తున్న ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు.
జూనియర్ ఎన్టీఆర్ ను ఆదిలోనే కట్ చేసి బాబు, ఇప్పుడు పార్టీలో సీనియర్లను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేసే వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉంటున్న బుచ్చయ్య చౌదరిని ఇప్పటికే పడుకోబెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
యంగ్ బ్లడ్ కావాలనే నెపంతో..
పార్టీలో సీనియర్లను పక్కనపెట్టి యువకులకు పెద్ద పీట వేయాలని నిర్ణయించుకున్నారు. కటాఫ్ వయసు ఎంత అనేది ఇంకా నిర్ణయించనప్పటికీ బుచ్చయ్య, అయ్యన్నపాత్రుడుతో పాటు చాలామందికి ఈసారి హ్యాండ్ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. అదే టైమ్ లో వారసుల్ని ఎంపిక చేసే ప్రక్రియను లోకేష్ కు కట్టబెట్టడం విడ్డూరం.
సహజంగా వారసత్వ పార్టీల్లో వారసుల భుజాల కంటే పైకి ఎవరినీ పైకి ఎదగనీయరు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్ పెట్టుకుంటూ వెళ్తారు. టీడీపీలో కూడా అదే జరుగుతోంది. కానీ టీడీపీ ఇక్కడ మరుగుజ్జు కావడం విశేషం. ఆయనకంటే తక్కువస్థాయిలో ఉండాలంటే ఎవరికీ కుదరని పని. సాక్షాత్తూ మంత్రిగా ఉంటూ, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. టీడీపీ తరపున 2019లో గెలిచిన మిగతా వారంతా లోకేష్ కంటే మిన్నే కదా.
అదే ఇప్పుడు చినబాబుకి మింగుడు పడని విషయం. అందుకే ఎమ్మెల్యేలు చేజారిపోతున్నా వారిని పట్టించుకోలేదు. తాజాగా బుచ్చయ్య చౌదరి వంటి నాయకులు నేరుగా రోడ్డెక్కినా వారించడంలేదు. పొమ్మనలేక వారికి పొగబెట్టిన చంద్రబాబు, ఇప్పుడు యువకులకు పెద్దపీట అనే పేరుతో మిగతావారిని కూడా పక్కకు నెట్టే ప్లాన్ రచిస్తున్నారు.
ఆముదం చెట్టే మహావృక్షం కాబోతోందా?
అంటే లోకేష్ కంటే లోకజ్ఞానం ఉన్నవారెవరూ పార్టీలో ఉండకూడదన్నమాట. అందరికీ లోకేషే చెప్పాలి, ఆయన చెప్పినట్టే జరగాలి. ఒకరకంగా లోకేష్ అడుగులకు మడుగులొత్తేవారు, చినబాబుకి జేజేలు పలికేవారితో ఓ కోటరీ ఏర్పాటు చేయబోతున్నారు. ఆ కోటరీ కనుసన్నల్లోనే అంతా జరగాలి, జరుగుతుంది కూడా. కానీ వీరిలో ఏ ఒక్కరూ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నవారు కాదు.
స్వయానా పార్టీ భావి నాయకుడికే అంత సీన్ లేదనే విషయం రెండేళ్ల క్రితం తేలిపోయింది. ఇప్పుడు మిగతా వారిని కూడా గడ్డిపరకల్లాంటి వారిని ఏరుకుని, ఆముదం చెట్టు లాంటి లోకేష్ ని మహావృక్షంగా చూపించబోతున్నారన్నమాట.