విశాఖకు ఎగ్జిక్యూటివ్ తరలింపు మాటేమో గానీ, దానిపై రాజకీయ దుమారం మాత్రం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో మూడు రకాల రాజధానుల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చట్టం కూడా చేసింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో నడుస్తోంది. మరోవైపు ఉత్తరాంధ్రలో పూర్వ వైభవం సాధించేందుకు టీడీపీ కిందామీదా పడుతోంది. ఈ నేపథ్యంలో విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖపట్నానికి చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమైతే ప్రాంతీయ విభేదాలు వస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌పై పెట్టుబడి పెట్టడం వల్ల విభజనతో ఇప్పుడు నష్టం జరిగిందన్నారు. విశాఖకు అన్ని రాజధాని హంగులు ఉన్నాయని తెలిపారు.
అత్యాశగా విశాఖపట్నం రాజధాని కోరలేదని, అన్ని అర్హతలు ఉండడం వల్లే విశాఖను రాజధాని నగరంగా ప్రకటించామని అవంతి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో టీడీపీకి ఓట్లు, సీట్లు కావాలే తప్ప అభివృద్ధి మాత్రం అవసరం లేదని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం టీడీపీ చేసిందేమి లేదన్నారు.
రానున్న 2024 ఎన్నికల్లో రాజధాని అంశమే ప్రధాన ఎజెండాగా ముందుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే న్యాయస్థానాల్లో రాజధాని అంశం ఇప్పట్లో తేలేలా లేదు. హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్తారు. అంతిమంగా ప్రజాకోర్టే రాజధాని ఎక్కడ? అనేది నిర్దేశించే అవకాశాలున్నాయి. అంత వరకూ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవు.