ఒకటిరెండువేల ఓట్ల తేడాతో ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎందువలన అలాంటి దుస్థితి దాపురించవచ్చునని టీఆర్ఎస్ భయపడుతూ ఉంటుందో ఇప్పుడు అదే జరుగుతోంది. ఎన్నికల బాలెట్ పేపర్లో కారును పోలిన రోడ్ రోలర్ గుర్తు ఉంటే.. తమకు చాలా నష్టం జరుగుతుందనేది టీఆర్ఎస్ వాదన. ఇప్పుడు మునుగోడు ఎన్నికలో కూడా వారికి ఆ బెడద తప్పలేదు. యుగతులసి అనే పార్టీకి చెందిన అభ్యర్థి రోడ్ రోలర్ గుర్తుతో బరిలోకి దిగుతున్నారు.
తెరాస ఈ ఎన్నికలో గెలవొచ్చు.. గెలవలేకపోవచ్చు.. అది వేరే సంగతి! కానీ ఎన్నికలో ఫలితం తేడా కొడితే మాత్రం.. చెప్పుకోడానికి ఒక కారణం, బిజెపి మీద వేయడానికి ఒక నింద వారికి రెడీ అయిపోయాయి.. ఆ కారణమే రోడ్ రోలర్!. గతంలో ఈటల రాజేందర్ చేతిలో ఓడిపోయినప్పుడు కూడా.. రోడ్ రోలర్ తమ పార్టీని ముంచేసిందని తెరాస ఆరోపణలు చేసింది.
ఓడిపోయిన తర్వాత సాకులు చెప్పుకోవడం సహజమే అయినా.. ఊరూపేరూ లేని అభ్యర్థికి ఆ ఎన్నికలో లభించిన మూడువేల పైచిలుకు ఓట్లను గమనిస్తే నిజమే అనిపిస్తుంది. అంతకుముందునుంచి కూడా ప్రతిసారీ.. రోడ్ రోలర్ గుర్తుపై తెరాస అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. చివరికి మునుగోడు ఎన్నికలో కూడా ఆ గుర్తును అభ్యర్థులు ఎవ్వరికీ కేటాయించవద్దంటూ.. ప్రత్యేకంగా ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు కూడా సమర్పించింది.
అయితే ఈ ‘రోడ్ రోలర్’ చుట్టూ చాలాపెద్ద డ్రామానే నడిచిందని చెప్పుకోవాలి. తెరాస వినతుల్ని ఈసీ పట్టించుకోలేదు. చిన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించే క్రమంలో స్థానిక రిటర్నింగ్ అధికారి లాటరీ పద్ధతిలో వచ్చిన రోడ్ రోలర్ గుర్తును యుగతులసి అనే పార్టీ అభ్యర్థికి కేటాయించేశారు. కేటాయిస్తున్నట్టుగా లెటర్ కూడా ఇచ్చారు. తమాషా ఏంటంటే.. ఆ తర్వాత.. కనీసం అతనికి సమాచారం కూడా ఇవ్వకుండా గుర్తును మార్చేసి రోడ్ రోలర్ బదులుగా బేబీ వాకర్ కేటాయిస్తున్నట్లుగా తెలియజేశారు. దీనిమీద రచ్చ రచ్చ అయిపోయింది.
రోడ్ రోలర్ ను ప్రధమ ప్రాధాన్యగుర్తుగా ఎంచుకోవడంతోనే.. తన హిడెన్ ఎజెండా ఏమిటో స్పష్టంగా తెలియజేసుకున్న సదరు యుగతులసి నాయకుడు.. కేంద్ర ఎన్నికల సంఘం తలుపుతట్టారు. ప్రెస్ మీట్ పెట్టి తూర్పారపట్టారు. ఈసీ సీరియస్ అయింది. ఆర్వోను తప్పించింది. కొత్త అధికారిని ఆర్వోగా నియమించింది. లేని అధికారాలు వాడి.. కేటాయించిన గుర్తును మార్చేశారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. అయితే సదరు ఆర్వో మాత్రం నాకు ఉన్న అధికారాలే వాడానని చెప్పడం విశేషం.
ఇప్పుడు మునుగోడు ఎన్నికలో తెరాస గెలిస్తే.. ఈ వివాదం ఇక్కడితో సమసిపోవచ్చు. కానీ బిజెపి గెలిచిందంటే.. ఓట్ల తేడాలో.. రోడ్ రోలర్ కు దక్కిన ఓట్ల ప్రభావం ఉన్నదని అనిపిస్తే.. తెరాస కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. బేబీ వాకర్ గుర్తును కేటాయించిన తర్వాత.. రాత్రికి రాత్రే గుర్తు మార్చి రోడ్ రోలర్ ఇవ్వడం వెనుక తమ పార్టీని ఓడించడానికి కుట్ర జరిగిందని ఆరోపించవచ్చు. ఇంకో కొత్త వివాదం స్టార్ట్ అవుతుంది. ఏదేమైనా.. తమ మీద బిజెపి కుట్ర చేస్తున్నదని మరి కొన్నేళ్లపాటు చెప్పుకోవడానికి తెరాసకు ఒక రీజన్ ఉంటుంది.