తెలుగు భాషా దినోత్సవాన్ని ఈ రోజు అంతా జరుపుకుంటున్నారు. గత రెండేళ్ళుగా ఈ ఉత్సవానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది. దానికి రాజకీయాలే కారణం అంటే తప్పు లేదేమో. జగన్ ప్రభుత్వం ఏపీలో ఆంగ్ల భాషా బోధనను ప్రాధమిక స్థాయి నుంచి ప్రవేశపెడతామని చెప్పడం జరిగింది. దాంతో తెలుగు వీరులు చాలా మంది బయల్దేరారు.
తెలుగు ఏమైపోతుంది అంటూ భాషా వేత్తలకే విస్మయం కలిగేలా మాట్లాడుతూ వచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఒకటి నుంచి పది వరకూ తెలుగుని కూడా ప్రధాన అంశంగా చేస్తామని ప్రకటించింది. కానీ తెలుగు అంటే జగన్ కి ఇష్టం లేదనట్లుగా చిత్రీకరించడానికి విపక్షాలు చాలానే చేస్తున్నాయి. దీని మీద భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు మండిపడ్డారు.
ఏపీలో తెలుగుకు ఏ మాత్రం నిరాదరణ లేదని, తమ ప్రభుత్వం తెలుగు ప్రాధాన్యతను పెంచుతూనే ఆంగ్ల బోధనను కూడా ప్రవేశపెడుతోందని చెప్పారు. ఈ సంగతి తెలిసి కూడా తమ ప్రభుత్వం మీద విపక్షాలు బురద జల్లుతున్నాయని ఆయన ఆగ్రహించారు.
తెలుగు అంటే అందరికీ ఇష్టమేనని, వేల సంవత్సరాల భాష. ప్రపంచంలో ఎక్కువ జనాభా మాట్లాడే పలు భాషలలో తెలుగు కూడా ఒకటి అని ఆయన అన్నారు. కాగా విశాఖలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించింది. మొత్తానికి అవంతి ఇచ్చిన క్లారిటీ తరువాత అయినా తెలుగు వీరులు తగ్గుతారా లేదా అన్నది చూడాలి.