విజయవాడ లో ఒక యువ పారిశ్రామిక వేత్త రాహుల్ ను కిరాతకంగా హత్య చేశారు. వ్యాపార లావాదేవీలు, క్రిమినల్ మనస్తత్వాలు, అంతులేని స్వార్ధ చింతనలు రాహుల్ ప్రాణాలను బలిగొని ఉండవచ్చు. కోగంటి సత్యం అనే ఒక క్రిమినల్ మైండ్ ఈ హత్య కు సూత్రధారి అని పోలీసులు చెబుతున్నారు.
నిజానికి ఈ హత్య కేసు మూలాలను విజయవాడ పోలీసులు కేవలం 4,5 రోజులలోనే తేల్చి, నిందితులను బందరు సబ్ జైల్ కు తోలారు( 'తోలారు' అనే పదం సహజంగా పశువులకు వాడతారు). ఇందుకు, విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు ను, ఆయన బృందాన్ని అభినందించాలి. అయితే, ఈ అనుభవం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖ ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.
ఒక్క విజయవాడ లోనే గాక, 13 జిల్లాల లో ప్రతి పట్టణం లోనూ కోగంటి సత్యం లు ఉన్నారు. పారిశ్రామిక వేత్తలూ ఉన్నారు. తమ భాగస్వాములనో … తమకు తెలిసిన ధనికులనో హతమార్చాలి అనుకునే వారికి లోటు ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రక్షణ కల్పించలేదు. ఏ క్షణాన ఎవరి మనసును 'కోగంటి సత్యం' మైండ్ సెట్ ఆవహిస్తుందో తెలియదు.
అందుకే, తమకు రక్షణ కావాలని భావించే ప్రతి ఒక్కరికి – గన్ మెన్ లను పోలీస్ శాఖ ఏర్పాటు చేయాలి. అలా కోరేవారి పై గతం లో ఎటువంటి క్రిమినల్ కేస్ లు ఉండి ఉండగూడదు. పోలీస్ రికార్డ్స్ లోకి ఎక్కి ఉండగూడదు. వారికి-రోజువారీ రాజకీయాలతో ప్రమేయం ఉండగూడదు. అటువంటి వారు- నిజంగా అభద్రతా భావానికి లోనైన పరిస్థితులలో ఉంటూ…. గన్ మెన్ ల జీత భత్యాలను సైతం వారే భరించే విధంగా ఉన్న వారికి – ఈ రక్షణ ఏర్పాటు చేస్తే – పోలీస్ శాఖ పై పని భారం బాగా తగ్గుతుంది.
విజయవాడ లో రాహుల్ హత్యా ఘటనను ఒక కొలిక్కి తీసుకురావడానికి విజయవాడ పోలీసు యంత్రాంగం వారం రోజులపాటు నిర్విరామంగా పనిచేసిందని ఒక డైనమిక్ పోలీస్ అధికారి చెప్పారు. ఇటువంటి భారం వీలైనంతగా తగ్గించుకోడానికి- ప్రాణ భయం ఉన్నదని భావించేవారికి గన్ మెన్ లను ఏర్పాటు చేయడమే పోలీస్ శాఖకు ఉత్తమం.
గన్ మెన్ సౌకర్యం ఉండి ఉంటే…రాహుల్ ప్రాణాలు అంత తేలిగ్గా గాలిలో కలిసిపోయి ఉండేవి కావు. 'గన్ మెన్ ల జీతభత్యాలు 100% భరించడానికి ముందుకు వచ్చే ప్రముఖులు…ప్రముఖులం అనుకుంటున్నవారికి ఈ సౌకర్యం కల్పించడం వల్ల, పోలీస్ శాఖపై ఆ గన్ మెన్ ల జీత భత్యాల భారం కూడా గణనీయంగా తగ్గుతుంది. 'విజయవాడ తరహా ' హత్యలు తగ్గుముఖం పడతాయి.
ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తే- ఆ రక్షణను ఉపసంహరించవచ్చు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం దుర్వినియోగం చేసినందుకు క్రిమినల్ కేస్ లు నమోదు చేయవచ్చు కూడా. రాష్ట్ర హోమ్ శాఖ ఈ సూచనను పరిగణన లోకి తీసుకుంటుందేమో చూద్దాం.
భోగాది వేంకట రాయుడు