జనసైనికులకు గుడ్ న్యూస్.. యామిని జంప్?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసి, జనసైనికుల ఆగ్రహానికి గురైన మహిళా నేత సాదినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె భారతీయ…

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసి, జనసైనికుల ఆగ్రహానికి గురైన మహిళా నేత సాదినేని యామిని టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలున్నాయి. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో ఆమె పలు దఫాలు భేటీ అయ్యారు. మంచి ముహూర్తం కూడా చూసుకున్నారట.

తననుతాను తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా, అధినేత చంద్రబాబుకు వినయవిధేయ కార్యకర్తగా చెప్పుకున్నారు యామిని. గత ఎన్నికల సమయంలో వైసీపీ, జనసేన పార్టీకి చెందిన కీలక నేతలపై యామిని చేసిన పలు ఆరోపణలు సంచలనం అయ్యాయి. తుదిశ్వాస వరకు టీడీపీలోనే కొనసాగుతానని అప్పట్లో ఆమె ప్రకటించారు కూడా. అలా ప్రకటించి 5 నెలలైనా కాకముందే, ఇలా తెరవెనక సంప్రదింపులు మొదలుపెట్టారు.

నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఓ మంచి పదవి ఆశించారు యామిని. కానీ ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. ఒక దశలో ఆమె పార్టీ టిక్కెట్ కూడా ఆశించారు. దానికోసం బాగానే ఖర్చు చేసినట్టు చెబుతారు. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ సమీకరణాల వల్ల బాబు ఆమెకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు. ఆ అసంతృప్తితో కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న యామిని ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు తొంగి చూస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మొత్తం ఎపిసోడ్ లో జనసైనికులు హ్యాపీ. ఆమె బీజేపీలో చేరితే పవన్ కల్యాణ్ పై విమర్శలు చేయరు. చేయలేరు కూడా. ఎందుకంటే తెరవెనక భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీలు ఒకటే అనే టాక్ ఎప్పట్నుంచో ఉండనే ఉంది. కాబట్టి జనసైనికులకు యామిని భయం తొలిగినట్టే.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?