శ్రీశైలం డ్యామ్ నుంచి రాయలసీమకు రికార్డు స్థాయిలో నీరు తరలుతూ ఉంది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు నలభై నాలుగు వేల క్యూసెక్కుల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేస్తూ ఉన్నారు. హంద్రీనీవా ద్వారా మరో రెండువేల క్యూసెక్కుల నీటిని, ముచ్చుమర్రి ద్వారా మరో వెయ్యి క్యూసెక్కుల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వదులుతున్నారు. ఒకవైపు వరద కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతాలకు ఈ స్థాయిలో జలప్రవాహం సాగుతూ ఉండటం ఆశాజనకమైన అంశం.
ఇంకా ఆగస్టు నెల ద్వితీయార్థంలోనే ఉన్నాం. దసరా సీజన్ వరకూ వర్షాలకు లోటు ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో కనీసం ఇంకా యాభై రోజుల పాటు వరద నీరు శ్రీశైలం వరకూ వచ్చే అవకాశాలున్నాయని జనవనరుల శాఖ అంచనా వేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రాయలసీమకు ఈ ఏడాది రికార్డుస్థాయి నీటి లభ్యత ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నాగార్జున సాగర్ పొంగిపొర్లుతూ ఉంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం నుంచి డ్యామ్ నుంచినే నీటిని రాయలసీమ వైపు భారీగా వదులుతూ ఉన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నలభై నాలుగు వేల క్యూసెక్కుల నీటిని వదలగల ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షాల లేమితో ఎప్పుడూ ఆ స్థాయిలో నీటి విడుదల జరగలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డి పాడు ద్వారా రికార్డు స్థాయి నీటిని రాయలసీమ వైపు వదులుతున్నారు. మరోవైపు రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. కాస్త ఆలస్యంగా అయినా అన్నిచోట్లా ఇప్పుడు వర్షపాతం నమోదు అవుతూ ఉంది. రైతాంగానికి ఎంతో ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.