రాజకీయ నాయకులు పబ్లిక్‌లో, పార్టీ సమావేశాల్లో సొంత విషయాలు మాట్లాడరు. పార్టీపరంగా చేయాల్సిన పనులు, ఎత్తుగడలు, అధికార పక్షాన్ని ఎలా ఢీకొనాలి…ఇలాంటి విషయాలు చర్చిస్తారు. నాయకుల వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి జనానికి ఉంటుంది కాబట్టి పత్రికలు, టీవీ ఛానెళ్లు అప్పుడప్పుడు సరదాగా ఇంటర్వ్యూలు చేస్తుంటాయి. ఆ కార్యక్రమాల్లో వారి బాల్యం, చదువు, ఉద్యోగం, వివాహం…మొదలైనవి సరదాగా చెబుతుంటారు. పార్టీ సమావేశాల్లోనూ 'సొంత డబ్బా' కొట్టుకుంటే బాగుండదని వారికి తెలుసు.
కాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమకాలీన రాజకీయాల గురించి మాట్లాడటం కంటే సొంత విషయాలు చెప్పుకోవడం ఎక్కువ. తాను సర్వసంగ పరిత్యాగినన్నట్లుగా మాట్లాడుతుంటాడు. ఇతర పార్టీలకు దేశభక్తి లేదని, జనసేనకు మాత్రమే ఉందన్నట్లుగా కలర్ ఇస్తుంటాడు. జనసేన ఎందుకు ఓడిపోయిందనేదానికి ప్రతి సమావేశంలో ఒక్కో కారణం చెబుతుంటాడు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీని తానే అధికారంలోకి తెచ్చానంటాడు.
తాజాగా పార్టీ సమావేశంలో తనకు 22 ఏళ్ల వయసున్నప్పుడు యోగ సాధనలోకి వెళ్లాలనుకున్నానని, సినిమాల్లో నటించాలనుకోలేదని చెప్పాడు. తాను చిన్ననాటి నుంచి చూసిన పరిస్థితులు, నమ్మిన విలువలే తనను రాజకీయాల్లోకి వచ్చేలా చేశాయన్నాడు. ఆ విలువల కారణంగానే 2014లో టీడీపీని అధికారంలోకి తెచ్చానని, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయానని అన్నాడు. ఓడిపోయినందుకు తాను బాధపడటంలేదన్నాడు. ఈ విషయం ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడో…!
నేతలు తనను అర్థం చేసుకోవడానికే తన సొంత విషయాలు పదేపదే చెబుతున్నానని అన్నాడు. ఇన్నేళ్లయినా పవన్‌ను పార్టీ నాయకులు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఇది విచిత్రమే. పవన్‌ను అర్థం చేసుకోవాలంటే నాయకులకు కావల్సింది సొంత విషయాలు కాదు. ఆయన రాజకీయ దృక్పథం, సమస్యలపై ఆయనకు ఉన్న స్పష్టత. సినిమాల్లోకి రాకముందు తాను పదిమందిలోకి వెళ్లేవాడిని కాదని, సిగ్గరినని పవన్ చెప్పాడు. గతంలోనూ ఈ విషయం చెప్పాడు. అన్నయ్య చిరంజీవి మాటలే తనను నటుడిని చేశాయని, ఆయన స్ఫూర్తితోనే పార్టీ పెట్టానని చెప్పాడు.
తాను ఏదీ ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, ఏదీ ఆశించి పనిచేయనని అన్నాడు. ఇది చెప్పడం బాగానే ఉంది. కాని ముఖ్యమంత్రి పదవి ఆశించి రాజకీయాల్లోకి రాలేదా? 'నేను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు' అని కూడా ఎన్నికల ప్రచారంలో ఓ సందర్భంలో చెప్పాడు. ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాదని, హంగ్ ఏర్పడుతుందని, అప్పుడు జనసేన కీలకపాత్ర పోషిస్తుందని అంచనా వేశాడు. గతంలో కర్నాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయిన తరహాలోనే తానూ అవుతానని ఆశపడ్డాడు. వ్యక్తిగత ప్రయోజనాలతో ముడిపడిన రాజకీయాలు సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని, దీనిపై ఎవరో ఒకరు మాట్లాడాలనిపించి తాను రాజకీయాల్లోకి వచ్చానని అన్నాడు. తనను అభిమానించేవారిని అడ్డు పెట్టుకొని సంపాదించుకోవాలని ఏనాడూ అనుకోలేదని పవన్ చెప్పాడు.
నేతలు సోషల్ మీడియాకు ఎక్కి రచ్చ చేస్తే సహించనని పవన్ తీవ్రంగా హెచ్చరించాడు. ఇది కాంగ్రెసు పార్టీ కాదన్నాడు. జనసేన ప్రాంతీయ పార్టీయేగాని ఇది దేశం కోసం ఆవిర్భవించిందని పవన్ చెప్పాడు. ఇక ఆయన పదేపదే చెబుతున్న విషయం జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని. ఓ ప్రముఖ పార్టీ (బహుశా బీజేపీ) విలీనం చేయాలని ఒత్తిడి చేస్తోందని, తలకు తుపాకీ పెట్టి బెదిరించినా ఆ పని చేయనని చెప్పాడు. ప్రజారాజ్యం పార్టీలా దీన్ని కూడా విలీనం చేస్తాడనే అనుమానం పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉండొచ్చు. అందుకే అదేపనిగా వివరణ ఇస్తున్నాడు.
పార్టీలో నేతల మధ్య సఖ్యత లేదని పొలిట్‌బ్యూరో సభ్యుడు పి.రామ్మోహన్ రావు అన్నాడు. 'జనసైనికులకు రాజకీయంగా అవగాహన లేకపోవడమే పార్టీ ఓటమికి కారణమని ఆయన చెప్పాడు. ఓటమికి ఇదొక్కటే కారణం కాదట. మద్దతు ఇచ్చే మీడియా లేకపోవడం కారణమన్నాడు. '99 టివి' పవన్ పార్టీదే అంటుంటారు కదా. ఇక సోషల్ మీడియా కూడా కొంప ముంచిందని చెప్పాడు. అంటే జనసేన ఓటమికి అనేక కారణాలున్నాయన్నమాట.
ఇక్కడ ప్రధానంగా రెండు ప్రశ్నలున్నాయి. నాయకులు పవన్ అర్థం చేసుకోలేకపోవడం, జనసైనికులకు (నేతలు, కార్యకర్తలు) రాజకీయ అవగాహన లేకపోవడం. ఈ రెండు లోపాలుంటే పార్టీ మనుగడ కష్టమనే విషయం పవన్ గ్రహించాడా?