అసెంబ్లీ కోటాలో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ జరగనుంది. ఏపీ అసెంబ్లీ కోటాలో మొత్తం నాలుగు రాజ్యసభ సీట్లు భర్తీ అవుతున్న సంగతి తెలిసిందే. బలాబలాల ప్రకారం ఈ నాలుగు రాజ్యసభ సీట్లూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతాయి. తెలుగుదేశం పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదనే విషయం తెలిసినా.. ఆ పార్టీ తన అభ్యర్థిని బరిలోకి దించింది. ఎలాగూ గెలవని సీటుకు వర్ల రామయ్య చేత నామినేషన్ వేయించి చంద్రబాబు నాయుడు ఏదో రాజకీయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు.
అయితే ఇప్పుడు విశేషం ఏమిటంటే.. తెలుగుదేశం పార్టీకి ఉన్నది 23 మంది ఎమ్మెల్యేల బలం. కనీసం ఆ ఓట్లు అయినా ఇప్పుడు టీడీపీ అభ్యర్థికి పడతాయా? అనేది! రాజ్యసభ సీటును నెగ్గాలంటే కనీసం 36మంది ఎమ్మెల్యేల బలం అవసరం. తెలుగుదేశం పార్టీకి అంత సీన్ ఎలాగూ లేదు. అయితే కనీసం 23 ఓట్లు అయినా టీడీపీకి పడేనా? అనేది కొశ్చన్ మార్కే. కౌంటింగ్ జరిగితే కానీ ఆ విషయంపై స్పష్టత రాకపోవచ్చు.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద పలువురు ఎమ్మెల్యేలు అవిశ్వాసాన్ని ప్రకటించారు. 23 మందిలో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అధికారికంగానే చంద్రబాబు మీద విమర్శలు చేశారు. అసెంబ్లీలో తమకు తెలుగుదేశం పార్టీతో సంబంధం లేదని, తమను సొంతంగా గుర్తించాలని విన్నవించిన వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోతే..తన బలం తగ్గిపోయిన విషయాన్ని తెలుగుదేశం తనే నిరూపించుకున్నట్టుగా అవుతుంది.