‘వద్దు వద్దం’టూ చాలామంది చెప్పారు. చెవినిల్లు కట్టుకుని పోరారు. కానీ జగన్ ప్రభుత్వం వినిపించుకోలేదు. కాంట్రాక్టుల్లో అవినీతిని పూర్తిగా నియంత్రించడమే తమ లక్ష్యం అనే ఒకే ఒక మాటకు కట్టుబడి ఉండిపోయింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రీటెండరింగుకు వెళ్లింది. ఈ విషయంలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పర్యవేక్షించే అథారిటీ సలహాలను కూడా పక్కన పెట్టేశారు. ఒకరకంగా ఇది జగన్ ప్రభుత్వం చేసిన సాహసం అనుకోవాలి. మరో నెలరోజులు గడిచేసరికి వారి ప్రయత్నం వలన ఫలితం కూడా తెలుస్తుంది.
పోలవరం ప్రాజెక్టు పనులను చేపడుతున్న ననయుగ సంస్థతో కాంట్రాక్టును ప్రభుత్వం రద్దుచేసిన నాటినుంచి.. ఈ ప్రాజెక్టు ప్రతిరోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. లోకల్ గా తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారంపై యాగీ చేసినంత వరకు చేసింది. ఈలోగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రత్యేకంగా రాష్ట్ర అధికార్లతో కలిపి ఓ సమావేశం పెట్టింది. రీటెండరింగ్ కరెక్టు కాదని, పనులు ఆలస్యం అవుతాయని, ఖర్చు పెరుగుతుందని, డిజైన్లు మారితే ప్రమాదం అని హెచ్చరించింది. ఖర్చు పెరిగితే తాము భరించం అంటూ బెదిరించింది కూడా.
అప్పటికీ జగన్ సర్కారు తగ్గలేదు. అథారిటీ మరింత చొరవ తీసుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. అందులోనూ రీ టెండరింగ్ వద్దనే సూచించింది. అయినా సరే ప్రభుత్వం తాము అనుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉంది. 1771 కోట్ల ప్రాజెక్టు పనులకు, 3216 కోట్ల జలవిద్యుత్ కేంద్రం పనులకు తాజాగా టెండరు పిలిచింది. మొత్తం అంచనా 4987 కోట్లుగా ఉంది. ఈ రెండింటికీ కలిపే కాంట్రాక్టర్లు బిడ్ చేయాల్సి ఉంటుంది.
సెప్టెంబరు 27వ తేదీనాటికి అన్ని లాంఛనాలు పూర్తవుతాయి. ఆరోజున ఫైనాన్షియల్ బిడ్ వేయడానికి ఆఖరు రోజు. అదే రోజున బిడ్స్ తెరచి కాంట్రాక్టరును ఖరారుచేస్తారు. అంటే మరో అయిదు వారాల్లో జగన్ ప్రభుత్వం చేస్తున్న ఈ రీటెండర్ సాహసం.. ఏమేరకు సత్ఫలితాన్ని ఇచ్చిందో తేలిపోతుంది. ప్రధానంగా ఖర్చు పెరగకుండా కాంట్రాక్టు ఓకే అయినా, డిజైన్లు మార్చాల్సిన అగత్యం రాకపోయినా, జాప్యం లేకుండా పూర్తి చేయగలిగినా.. జగన్ సర్కారును శెభాష్ అనాల్సిందే.
వీటిలో మూడో అంశం ఇప్పుడే తేల్చడం కష్టం. సెప్టెంబరు 27నాటికి ప్రాజెక్టు వ్యయంలో ఈ రీటెండరు వలన ఏం తేడా వచ్చిందో తేలిపోతుంది. వ్యయం పెరిగిందా.. సర్కారు పప్పులో కాలేసినట్లే! వ్యయం తగ్గించగలిగారా… ఇన్నాళ్లు విమర్శించిన వారికి, అడక్కపోయినా సలహాలు చెప్పిన వారికి బుద్ధి చెప్పినట్లే! వారి నోర్లకు తాళాలు వేసినట్లే!