జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఖాతాలో ఇప్పటికే చాలా సెల్ఫ్ గోల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన తన పంథా మారడం లేదని నిరూపించుకున్నారు. నిన్నమొన్నటి వరకూ తోలు తీస్తా, తాటా తీస్తా.. అంటూ మటన్ కొట్టు మస్తాన్ వలే మాట్లాడిన పవన్ కల్యాణ్, ఇప్పుడు చెప్పుతో కొడతా నా కొడకల్లారా.. అంటూ చెప్పు తీసి చూపిస్తూ సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.
రాజకీయ పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు గడిచిపోయినా, దాదాపు పుష్కర కాలం పై నుంచినే రాజకీయంలో తిరుగుతున్నా పవన్ కల్యాణ్ సాధించిన పరిణతి ఏమిటో ఈ రోజుతో క్లారిటీ వచ్చింది సభ్యసమాజానికి. ఒక రాజకీయ పార్టీ అధినేత ఇలా చెప్పులు తీసి చూపించేంత స్థాయికి రాజకీయాన్ని దిగజార్చిన ఘనత పవన్ కల్యాణ్ కే దక్కింది. మరి ఏ కేఏ పాలో ఇలాంటి చర్య చేశాడంటే ప్రజలు దాన్నొక ప్రహసనంగా తీసుకుంటారు.
ఆరు శాతం ఓట్లు ఉన్న పార్టీ అధినేత, సినిమాల్లో లెక్కలేనన్ని సందేశాలు, రాజకీయాల్లో విలువల గురించి నిత్యం చెప్పే పవన్ కల్యాణ్ ఇలా చెప్పుతో కొడతా అంటూ రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడటం ఏ స్థాయి సభ్యతో వేరే వివరించనక్కర్లేదు.
తను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానంటూ చంద్రబాబు తర్వాత అతి ఎక్కువగా చెప్పుకునే వారిలో పవన్ కల్యాణ్ ముందుంటారు. తనవి సభ్యతతో కూడిన రాజకీయాలు అంటూ పవన్ నిత్యం చెప్పుకుంటూ ఉంటారు! బహుశా పవన్ చెప్పే సభ్యతతో కూడిన రాజకీయాలు ఇవే కాబోలు. మరి ఈ సభ్యత ఇంతటితో ఆగుతుందా లేక ఇంకా పరాకాష్టకు చేరుతుందా అనేది శేష ప్రశ్న!
ఒకవైపు కుల రాజకీయాలు చేయనంటూ పదే పదే కులం గురించి మాట్లాడటం, కుల కోణంలోనే ఏకం కమ్మంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నేతలు తమ కులాన్ని తక్కువ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించడం పవన్ కే చెల్లింది. మరి ఈ చెప్పు తీసి పవన్ కల్యాణ్ తన రాజకీయ ప్రత్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబోలు.
అయితే.. ఈ తీరుతో పవన్ కల్యాణ్ తనను తాను చాలా పలుచన చేసుకున్నాడు. చులకన అవుతున్నాడు. ఎవరో చులకన చేయడం కాదు తనను తానే చులకన చేసుకుని పవన్ కల్యాణ్ తన రాజకీయ చరమాంకం దిశగా వెళ్తున్నాడు.