హుజూరాబాద్ బరిలో ఇంకా ఎవరెవరు ?

హుజూరాబాద్ ఉప ఎన్నిక యుద్ధం మొదలై చాలా కాలమైంది. కానీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఎప్పుడొస్తుందో తెలియదు. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం…

హుజూరాబాద్ ఉప ఎన్నిక యుద్ధం మొదలై చాలా కాలమైంది. కానీ ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఎప్పుడొస్తుందో తెలియదు. ప్రస్తుతం అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కంటే ఎక్కువగా తనను గెలిపిస్తుందన్న నమ్మకం ఉన్న దళితబంధు పైన ఎక్కవగా ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తోంది. ఒక్క ఉప ఎన్నికలో గెలుపు కోసం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి అలుపుసొలుపూ లేకుండా కష్టపడుతున్నారు. ఇప్పటికైతే రంగంలో మూడు పార్టీలే ప్రధానంగా కనబడుతున్నాయి.

కొత్తగా పార్టీ పెట్టి కేసీఆర్ పైన, టీఆర్ఎస్ మీద విమర్శలు గుప్పిస్తున్న వైఎస్ షర్మిల నేరుగా రంగంలోకి దిగాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేరుగా రంగంలోకి దిగడమంటే వైఎస్సార్ టీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టడమన్నమాట. కానీ ఆమె ఆ పని చేయబోవడం లేదని, నిరుద్యోగులతో భారీగా నామినేషన్లు వేయించాలనే ఆలోచన చేస్తోందని సమాచారం వస్తోంది. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తాను అనుకున్న ప్లాన్ కార్యరూపంలో పెడుతుండొచ్చు.

ఇక గులాబీ పార్టీ ఆశలన్నీ దళితబంధు మీదనే ఉన్నాయి. హుజూరాబాద్ లో ఆ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తానని చెప్పిన కేసీఆర్ అందుకు 2000 కోట్లు కేటాయిస్తానని చెప్పారు. చెప్పనట్లుగానే ఆ డబ్బు మొత్తం విడుదల చేసేశారు. ఈ పథకం మీద ప్రచారం కూడా జోరుగా సాగిస్తున్నారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక కథ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనబడుతున్నాయి.  

తెలంగాణ వ్యాప్తంగా దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు తెచ్చామని టీఆర్ఎస్ చెబుతోంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉండే దళితులను తమ వైపు తిప్పుకోవడానికి టీఆర్ఎస్‌ ప్రయత్నాలు చేస్తుంటే.. దళితుల ఓట్లను సొంతం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకొచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తనదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. 

కొద్దిరోజుల క్రితం బీఎస్పీలో అంటే బహుజన సమాజ్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు దళిత వర్గంలో మంచి ఆదరణ ఉంటుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. ఆయన బీఎస్పీలో చేరేందుకు ఏర్పాటు చేసిన సభకు కూడా మంచి స్పందన వచ్చింది. ఇదే సమయంలో ఆయన చేసిన విమర్శలకు టీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో బీఎస్పీ రాజకీయాలన్నీ ప్రవీణ్ కుమార్ సారథ్యంలోనే ముందుకు సాగే అవకాశం ఉండటంతో.. హుజూరాబాద్‌లో ఆ పార్టీ అభ్యర్థి బరిలోకి దిగుతారా ? లేదా ? అనే అంశంపై తుది నిర్ణయం కూడా ఆయనదే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

హుజూరాబాద్‌లో పోటీ చేసే విషయంలో ఆయన అంతగా ఆసక్తి చూపించడం లేదనే వార్తలు వచ్చినా కీలకమైన ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి పెరుగుతోందని తెలుస్తోంది. దీంతో దీనిపై ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. ఒకవేళ బీఎస్పీ హుజూరాబాద్‌లో పోటీ చేస్తే.. అక్కడి అభ్యర్థి తరపున ప్రచారం చేసే బాధ్యత కూడా ప్రవీణ్ కుమార్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. ఆయన ఎక్కువగా టీఆర్ఎస్‌నే టార్గెట్ చేసే అవకాశాలు ఉంటాయి.

ఇప్పటికే అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు ప్రవీణ్ కుమార్. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో బీఎస్పీ అభ్యర్థిని దింపితే దాని ప్రభావం అందరికంటే ఎక్కువగా టీఆర్ఎస్‌పైనే ఉంటుందని.. టీఆర్ఎస్‌కు రావాల్సిన దళిత ఓట్లను ఆయన ఎంతో కొంత చీల్చే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద షర్మిల పార్టీ పరోక్షంగా, బీఎస్పీ ప్రత్యక్షంగా బరిలోకి దిగే ఛాన్స్ ఉండొచ్చు.