కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం టీడీపీలో విభేదాలు బట్టబయలు అయ్యాయి. ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జ్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ విషయమై చంద్రబాబు, లోకేశ్‌తో పాటు గల్లీ నాయకుల వరకూ అందరూ ఖండించారు. ప్రభుత్వం కక్షతో వ్యవహరిస్తూ అన్యాయంగా ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని కడప పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీ బీటెక్ రవి, కమలాపురం ఇన్చార్జ్ పుత్తా నరసింహారెడ్డి తదితరులు పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే కడప పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి మాత్రం ప్రకటనతో సరిపెట్టారు.
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే కూడా అయిన లింగారెడ్డికి ప్రవీణ్‌తో తీవ్రస్థాయిలో విభేదాలున్నాయనేందుకు ఇదే నిదర్శనం. తనను కాదని ప్రొద్దుటూరు ఇన్చార్జ్గా ప్రవీణ్‌ను ప్రకటించినప్పటి నుంచి వాళ్లిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రొద్దుటూరు కేంద్రంగా రాజకీయాలు చేసే లింగారెడ్డి, తమ పార్టీకి చెందిన నాయకుడిని అరెస్ట్ చేసినపుడు కనీసం పరామర్శించక పోవడంపై టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది.
లింగారెడ్డి వైఖరిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కుమ్మక్కై పార్టీ బలహీన పడేందుకు లింగారెడ్డి ప్రయత్నిస్తున్నారనే అనుమానాల్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ను అరెస్ట్ చేసినపుడు కూడా కడప పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా స్పందించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లింగారెడ్డిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.