బాధ్యతలేని మాటలు నేతలకు తగదు!

కొన్ని మాటలు చాలా కిక్ ఇస్తాయి. నాటకీయంగా ఉంటాయి. వినేవాళ్లకు కూడా బాగా రుచిస్తాయి. కానీ బాధ్యతగల ప్రజాప్రతినిధులు అలాంటి మాటలు మాట్లాడ్డానికి వీల్లేదు. ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చీఫ్ విప్ గట్టు…

కొన్ని మాటలు చాలా కిక్ ఇస్తాయి. నాటకీయంగా ఉంటాయి. వినేవాళ్లకు కూడా బాగా రుచిస్తాయి. కానీ బాధ్యతగల ప్రజాప్రతినిధులు అలాంటి మాటలు మాట్లాడ్డానికి వీల్లేదు. ఇపుడు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చీఫ్ విప్ గట్టు శ్రీకాంత్ రెడ్డి మాటలు కూడా ఇలాగే బాధ్యత లేకుండా కనిపిస్తున్నాయి. మహిళల మీద జరిగే దాడుల పట్ల ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వాటిని అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చాలా రకాలుగా నిరూపించుకోవచ్చు. కానీ.. బాధ్యతగల నాయకుడిగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ… మహిళలపై దాడులు చేసే వారిని ఎన్ కౌంటర్ చేసేయాలంటూ శ్రీకాంత్ రెడ్డి పిలుపు ఇవ్వడం వివాదాస్పదమే అనిపించుకుంటుంది.

చంద్రబాబునాయుడు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడానికి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విలేకర్ల సమావేశం పెట్టారు. పోలీసులను తమ ప్రభుత్వం, తమ చేతుల్లో పెట్టుకోకుండా.. వారి పని వారు చేసేందుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం అని చెప్పడం ఆయన ఉద్దేశం. చంద్రబాబు లాగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాల్సిందిగాన అధికార్లను ఆదేశించడం లేదని, వారికి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పదలచుకున్నారు.

అయితే అందుకోసం.. ‘మహిళలపై ఎవరైనా దాడిచేస్తే ఎన్ కౌంటర్ చేయండి’ అని పోలీసులకు సూచనలిచ్చినట్లుగా చెప్పుకొచ్చారు. పైగా ఈ మాట జగన్ స్వయంగా చెప్పినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇదంతా పోలీసులను ‘సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా’ తమ ప్రభుత్వం చెబుతోందని ఆయన ఉద్దేశం. కానీ ఆ మాటలు అలా లేవు.

బాద్యతగల పదవుల్లోకి వచ్చిన తర్వాత.. తాము మాట్లాడే ప్రతి మాటకు విలువ ఉంటుందని, ఆ మేరకు తాము జాగ్రత్తలు తీసుకోవాలని నాయకులు గ్రహించాలి. ఇలాంటి మాటలు ప్రభుత్వాల్ని ఇరుకున పెడతాయి. నాయకులు అయిన తర్వాత.. జాగ్రత్తగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి.