ఆరు నెలలు అరుపులు భరిద్దాం…!

ఆరు నెలలు పాటు అరుపులు కేకలు తప్పదు, భరిద్దాం అంటున్నారు వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీలో మూడు దిక్కులా పవన్ చంద్రబాబు లోకేష్ తిరుగుతూ జగన్…

ఆరు నెలలు పాటు అరుపులు కేకలు తప్పదు, భరిద్దాం అంటున్నారు వైసీపీ సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఏపీలో మూడు దిక్కులా పవన్ చంద్రబాబు లోకేష్ తిరుగుతూ జగన్ మీద తీవ్ర అసహనంతో విమర్శలు చేయడం దారుణం అన్నారు.

వీరంతా ఉండేది హైదరాబాద్ లో అని, ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. వచ్చే ఏడాది ఉగాదికి ఆరు నెలల సమయం ఉందని, అప్పటికి ఎన్నికల్లో ఓడి వీరంతా హైదరాబాద్ కి తమ సొంత చిరునామాకు చేరుకుంటారని అన్నారు. అప్పటివరకూ వీరిని సహించాల్సిందే అని అన్నారు.

రుషికొండ మీద ప్రభుత్వ భవనాలను కడుతూంటే పవన్ కి వచ్చిన నొప్పి ఏంటని బొత్స ప్రశ్నించారు. ప్రభుత్వం భవనాలు కట్టకూడదా అని ఆయన నిలదీశారు. చంద్రబాబు ఏది రాసిస్తే ఆ స్క్రిప్ట్ ని చేత బట్టుకుని చదవడం తప్ప వాస్తవం అన్నది పవన్ చూడడంలేదని అన్నారు. టీడీపీలో పెత్తందారీ వ్యవస్థ అవినీతి అక్రమాలు పవన్ కంట కనబడకపోవడం కంటే బాధాకరం మరోటి లేదని అన్నారు.

చంద్రబాబు తీరు ఇంకా శోచనీయంగా ఉందని అన్నారు. ఆయన అనుభవం కూడా పక్కన పెట్టి జగన్ మీద అక్కసు వెళ్లగక్కుతున్నారని అన్నారు. వినేవాడు ఉంటే ఎన్ని అయినా చెప్పడానికి చంద్రబాబు తయారుగా ఉంటారని బొత్స సెటైర్లు వేశారు.

చంద్రబాబును ఏపీ ప్రజలు ఓడించి పంపిస్తే హైదరాబాద్ లో కాపురం ఉంటున్నారని, అలాంటి బాబు ఎన్నికలు దగ్గర పడుతూండడంతో ఉన్నవీ లేనివీ చెప్పి వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాలు బాధ్యతగా నిర్మాణాత్మకంగా ఉండాలని కానీ ఏపీలో అలాంటి పరిస్థితి అయితే కనిపించడంలేదని అన్నారు.

చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ఏపీ హక్కులను అన్నింటినీ కాలరాసి పాలన చేశారని విమర్శించారు. ఇపుడు మళ్లీ అధికారంలోకి వస్తే ఉద్ధరిస్తాను ని ప్రకటనలు చేయడం అంటే ప్రజలు ఏమైనా వింటారని భావిస్తున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 

ఈ మధ్యనే ఆరు నెలలు ఆగితే ఆ పార్టీలు ఉండవని బొత్స అన్నారు. ఇపుడు విశాఖలో మరోసారి అదే మాటను ఆయన అంటున్నారు. పైగా తన అనుభవంతో ప్రజా జీవితంలో ఎన్నో ఎన్నికలను చూసిన మీదట మాట్లాడుతున్నానని బొత్స అంటున్నారు. ప్రజలకు మేలు చేయని, కోరుకోని పార్టీలకు స్థానం ఉండదని బొత్స అంటున్నారు.