తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్కకు రాఖీ తంటా తెచ్చింది. రక్షాబంధ్‌ను పురస్కరించుకుని తన మాజీ బాస్ నారా చంద్రబాబునాయుడికి సీతక్క రాఖీ కట్టి ఆశీస్సులు తీసుకున్నారు. దీంతో సీతక్కపై ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్, ఆంధ్రాలో టీడీపీ…ద్విపార్టీ పౌరసత్వం అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్స్ పెట్టారు. మరికొందరు టీడీపీ, ఆంధ్రా బానిస అంటూ అభ్యంతరకర కామెంట్స్ చేయడం చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో బుధవారం ఒక సమావేశంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తనపై ట్రోల్ చేసిన వారిపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా టీఆర్ఎస్ నేతలను దృష్టిలో పెట్టుకుని ఆమె ఘాటు హెచ్చరికలు చేశారు. రేయ్ అంటూ…ఓ రేంజ్‌లో ఆమె రెచ్చిపోయారు. సీతక్క ఆవేశం, ఆవేదన ఆమె మాటల్లోనే…
“రేవంత్‌రెడ్డికి, చంద్రబాబునాయుడికి ఇదేదో ఇప్పుడే ప్రత్యేకంగా రాఖీలు కట్టలేదు. 14-15 సంవత్సరాలుగా రాఖీ కడుతున్నా. పార్టీ మారినందుకో, ప్రాంతం వేరైనందుకో, చంద్రబాబు సీఎం కానందుకో నేను రాఖీ కట్టకుండా ఉండలేదు. వ్యక్తిగత పరిచయాలు, బంధాలు, అనుబంధాలను దృష్టిలో పెట్టుకుని రాఖీ కట్టా. రాఖీని కూడా రాజకీయం చేశారు.
శవాల మీద రాజకీయ లబ్ధి పొందేవాళ్లు … నన్ను బానిసనో మరొకటో అంటే ఖబడ్దార్. మమ్మల్ని బానిసలనే దుర్మార్గుడా, నీ బానిసత్వానికి వ్యతిరేకంగా, మీ దొరతనానికి వ్యతిరేకంగా ఇక్కడే మా నాయకుడున్నాడు కొమురం భీం. ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా, బందూకులు పట్టినటువంటి కొమురం భీం వారసత్వంరా మాది. బానిసత్వానికి బడితె పూజ పెట్టి తరిమి తరిమి కొట్టిన చరిత్ర మాది” అంటూ ఆమె అనేక విషయాలను ప్రస్తావిస్తూ… దీటైన కౌంటర్ ఇచ్చారు.
సీతక్క మాట్లాడిన వీడియోను టీడీపీ సోషల్ మీడియా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం … కాంగ్రెస్, టీడీపీ మధ్య అనుబంధాన్ని తెలియజేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.