జగన్ నిర్ణయంతో పత్రికల్లో కాస్ట్ కటింగ్

సోషల్ మీడియా రాకతో.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా హవా బాగా తగ్గిపోయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విషయంపై యాజమాన్యాలకు పూర్తిక్లారిటీ వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఏ రాజకీయ నాయకుడూ…

సోషల్ మీడియా రాకతో.. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా హవా బాగా తగ్గిపోయింది. సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ఈ విషయంపై యాజమాన్యాలకు పూర్తిక్లారిటీ వచ్చింది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇచ్చుకోవడానికి ఏ రాజకీయ నాయకుడూ ఇష్టపడలేదు. అందులో పదోవంతు ఖర్చుతో ఓ సోషల్ మీడియా వింగ్ తయారు చేసుకుని పని కానిచ్చేసుకున్నారు. మరోవైపు ప్రింటింగ్ ఖర్చు తడిసిమోపెడు కావడం కూడా పత్రికలకు కష్టంగా మారింది. దీనికితోడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం టీడీపీ అనుకూల పత్రికలకు మరో శరాఘాతం.

చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టారీతిన ప్రకటనలతో కోట్ల రూపాయలు దోచుకున్నాయి కొన్ని పత్రికలు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరంగా ఆడంబరాలు, అదనపు ఖర్చులకు కోత వేసేశారు. రెండున్నర నెలల్లోనే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ పత్రికకి అయినా ప్రభుత్వ ప్రకటనలే ప్రాణ వాయువు. అలాంటి ప్రాణవాయువు కొరత ఏర్పడటంతో తోక పత్రికలు విలవిల్లాడుతున్నాయి. అటు సాక్షి కూడా దీనికి మినహాయింపు కాదు.

ఆదాయం తగ్గేసరికి అన్ని యాజమాన్యాలు కాస్ట్ కటింగ్ మొదలు పెట్టాయి. ముఖ్యంగా ఫొటోగ్రాఫర్ వ్యవస్థకు మంగళం పాడేందుకు సిద్ధమయ్యాయి యాజమాన్యాలు.. వారికి స్వచ్ఛంద పదవీ విరమణ అమలు చేసి, వారి స్థానంలో రిపోర్టర్లే ఫొటోలు పంపే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యమైన మీటింగ్ లు, సమీక్షలకు ఎలాగూ ప్రభుత్వమే సోషల్ మీడియాలో అధికారిక ఫొటోలను ఉంచుతోంది. వీటితో పనికానిచ్చేద్దామనుకుంటున్నారు.

ఇక ఎడిటోరియల్ స్టాఫ్ మెడపై కూడా కత్తి వేలాడుతోంది. ఇప్పటికే “ఈనాడు డిజిటల్” అంటూ మానవ వనరుల కోసం కొత్త ఎత్తుగడ వేసిన ఈనాడు… “న్యూస్ టుడే” భారం తగ్గించుకోవాలని చూస్తోంది. డిజిటల్ కింద తక్కువ వేతనానికి చాలామందిని రిక్రూట్ మెంట్ చేసుకుంటూ సీనియర్లకు ఎసరు పెడుతోంది. ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే జరుగుతోంది. సాక్షిలో పూర్తిస్థాయిలో ఈ పద్ధతి ఇంకా అమలులోకి రాలేదు. కాస్ట్ కటింగ్ లో మరో ముఖ్యమైన అంకం ప్రింట్ ఖర్చులు తగ్గించుకోవడం.

ఇప్పటికే మూడు ప్రధాన పత్రికల్లో పేజీల సంఖ్య తగ్గిపోయింది. ఆ మధ్య ఫీచర్ పేజీలతో అల్లాడించిన ఈనాడు కూడా 12 పేజీల డెడ్ లైన్ పెట్టుకుంది. పూర్తి వివరాలకు ఈనాడు వెబ్ పేజీ చూడండి అంటూ లింక్ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఇక సాక్షి, జ్యోతి కూడా ప్రింట్ ఖర్చులు బాగా తగ్గించేసుకున్నాయి. పేజీల సంఖ్య తగ్గించేశాయి. సోషల్ మీడియా ప్రభావం, జగన్ సర్కారు దుబారా తగ్గించడం.. ఈ రెండు కారణాలతో తెలుగు పత్రికారంగం కుదేలవుతోంది. కాస్ట్ కటింగ్ మొదలు పెట్టింది.