డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్న వాళ్లున్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారు కూడా ఉన్నారు. కానీ తన హత్యకు తానే సుపారీ ఇచ్చుకునే వ్యక్తులున్నారా? ఢిల్లీలో ఈ సంచలన ఘటన జరిగింది. గౌరవ్ అనే కిరాణా షాపు ఓనర్ తనను చంపాల్సిందిగా, ఓ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చి హత్యకు గురయ్యాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆత్మహత్య లాంటి హత్య.
ఢిల్లీలోని ఐపీ ఎక్స్ టెన్షన్ లో కిరాణా బిజినెస్ చేస్తుంటాడు గౌరవ్. కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్నాడు. దీంతో క్రెడిట్ కార్డ్ దుర్వినియోగానికి కూడా పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇక చనిపోవడమే మార్గమని అనుకున్నాడు. తను చనిపోతే తన కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని, వాళ్లు ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారని భావించాడు.
తన హత్య కోసం ఓ మైనర్ బాలుడ్ని సంప్రదించాడు. అతడి ద్వారా ఓ గ్యాంగ్ ను కాంటాక్ట్ అయ్యాడు. వాళ్లకు సుపారీ ఇచ్చాడు. ఢిల్లీ శివారులోని రన్ హౌలా ప్రాంతానికి చేరుకున్నాడు. తన మొబైల్ ద్వారా, తన ఫొటోలనే గ్యాంగ్ కు చేరవేశాడు. విషయం తెలియని సుపారీ గ్యాంగ్.. ఫొటోల ఆధారంగా గౌరవ్ ను గుర్తించి, అతడి చేతులు కట్టేశారు. దగ్గర్లోని చెట్టుకు ఉరేసి చంపేశారు.
గౌరవ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి మృతదేహాన్ని గుర్తించారు. గౌరవ్ మొబైల్ ఫోన్ ఆధారంగా మొత్తం వ్యవహారాన్ని ఛేదించారు. హత్యకు సంబంధించి ఇప్పటికే మైనర్ బాలుడితో సహా ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. గౌరవ్ కు రావాల్సిన బీమా మొత్తం ఎంత, సుపారి కింద ఎంతిచ్చాడు లాంటి అంశాల్ని పరిశీలిస్తున్నారు.