పవన్ సినీ ప్రవచనాలు.. వినాలని ఉందా?

పవన్ కల్యాణ్ ప్రసంగాలు వింటుంటే ఆయన అభిమానులకు ఊపొస్తుంది కానీ, సామాన్య జనానికి మాత్రం నవ్వొస్తుంది. ఆవేశం, అక్కర్లేని మాటల్ని కూడా ఊగిపోతూ చెప్పడం, కాస్త గట్టిగా చెప్పాల్సిన పాయింట్ ని క్యాజువల్ గా…

పవన్ కల్యాణ్ ప్రసంగాలు వింటుంటే ఆయన అభిమానులకు ఊపొస్తుంది కానీ, సామాన్య జనానికి మాత్రం నవ్వొస్తుంది. ఆవేశం, అక్కర్లేని మాటల్ని కూడా ఊగిపోతూ చెప్పడం, కాస్త గట్టిగా చెప్పాల్సిన పాయింట్ ని క్యాజువల్ గా వదిలేయడం పవన్ ప్రసంగాల్లో గమనిస్తుంటాం. తాజాగా ఓ సినీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సినిమాలపై తన అభిప్రాయాలను విడమరిచి చెప్పారు పవన్. అంతా బాగానే ఉంది కానీ, ఆయన ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు అనేది మాత్రం ఆయనతో పాటు విన్నవారికి కూడా సస్పెన్స్ గానే మిగిలిపోయింది.

సినిమాలతో ప్రపంచాన్ని శాసించొచ్చని సెలవిచ్చారు పవన్ కల్యాణ్. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం అని కూడా అన్నారు. ఇంతకీ ప్రపంచాన్ని శాసించే సినిమా అంటే ఏంటి? అలాంటి సినిమా తీసి శాసించిన డైరెక్టర్, హీరో ప్రపంచాన్ని ఏలేస్తారా ఏంటి? శాసించడం అంటే ఆయన దృష్టిలో ప్రపంచం అంతా మెచ్చుకోదగ్గ సినిమా అనుకుందాం. ఆ తర్వాత బాహుబలి సినిమాకి కూడా తనదైన కాంప్లిమెంట్ ఇచ్చారు పవన్ కల్యాణ్. బాహుబలి సినిమాలో అద్భుతమైన సాహిత్యం ఉందట.

“బాహుబలి వంటి సినిమాలు వచ్చినా.. ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదు. అది మనం అర్థం చేసుకోగలిగితే గొప్ప సినిమాలు వస్తాయి”. అన్నారు. అసలు బాహుబలిలో గొప్ప సాహిత్యం ఉందా, గొప్ప సాంకేతికత ఉందా.. ఇది రాజమౌళి చెబితే బాగుంటుంది. పుస్తకావిష్కరణకు వచ్చాడు కాబట్టి సినిమా సాహిత్యాన్ని పొగడాలనే ఉద్దేశంతో.. “బాహుబలి సాహిత్యం” అనే పదాన్ని హైలెట్ చేశారు పవన్.

ఇన్ని మాటలు చెబుతున్న పవన్ ఇన్నాళ్లూ కమర్షియల్ చట్రంలో ఎందుకు బందీ అయిపోయినట్టు. ఉపన్యాసాలు ఇవ్వడానికి హాయిగా ఉంటుంది కానీ, కమర్షియల్ చట్రం దాటి సినిమా తీయాలంటే దానికి దమ్ము, ధైర్యం ఉండాలి. మెగా ఫ్యామిలీ ఇప్పటి వరకూ అలాంటి రిస్క్ ఎక్కడా చేయలేదు. అప్పుడెప్పుడో రుద్రవీణ సినిమా తోటే వారికి జ్ఞానోదయం అయిపోయింది.

ఇక పవన్ కల్యాణ్ జమానాలో ఎక్కడా సమాజం, సమాజ హితం అనే మాటే లేదు. సత్యాగ్రాహి అనే సినిమా కోసం తాపత్రయపడ్డా వెనకడుగేశారు. అలాంటి పవన్ కల్యాణ్ తీరిగ్గా ఇప్పుడు సినిమాల్లో నుంచి బైటకొచ్చి, ప్రపంచాన్ని శాసించే సినిమాలు తీయండని ప్రవచనాలు చెబుతున్నారు. 

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!