మరో 3 రోజుల్లో చిరంజీవి పుట్టినరోజు. ఏటా చిరంజీవి బర్త్ డే కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. కానీ ఈసారి ఆయన పుట్టినరోజు కోసం ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం, తాజాగా ఆయన కొత్త సినిమాపై వచ్చిన ఊహాగానాలే.
చిరంజీవి తన కొత్త సినిమాను ప్రకటిస్తారా? ప్రకటిస్తే పుట్టినరోజు నాడు లాంచ్ చేస్తారా? ఇదే ఇప్పుడు డిస్కషన్ పాయింట్ గా మారింది. చిరు నటించిన భోళాశంకర్ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో ఆయన సినిమాలకు కొన్నాళ్ల పాటు విరామం ప్రకటిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. వాటిపై మరో 3 రోజుల్లో క్లారిటీ రానుంది.
దీనికితోడు చిరంజీవి చిన్నపాటి సర్జరీ చేయించుకున్నారు. కోలుకోవడానికి వారం, పది రోజులు పడుతుంది. కాబట్టి పుట్టినరోజు నాడు లాంఛింగ్ లాంటివి ఉండకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అయితే లాంఛింగ్ లేకపోయినా, ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయడానికి ఇబ్బందేం లేదు. భోళాశంకర్ కారణంగా, కొత్త సినిమా ప్రకటన వస్తుందా అనేది మరో డౌట్.
అన్నీ అనుకున్నట్టు జరిగితే చిరంజీవి, కల్యాణకృష్ణ కాంబినేషన్ లో కొత్త సినిమా వస్తుంది. చిరంజీవి కుమార్తె ఈ ప్రాజెక్టుకు నిర్మాత. అయితే భోళాశంకర్ తరహాలో ఇది కూడా రీమేక్ సినిమానే. అక్కడే వచ్చింది చిక్కు. ధైర్యం చేసి మరోసారి రీమేక్ ప్రాజెక్టునే ఎనౌన్స్ చేస్తారా లేక గ్యాప్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
కల్యాణకృష్ణ ప్రాజెక్టు కాకుండా, చిరంజీవి ఎనౌన్స్ చేయాలనుకుంటే మరో 2 సినిమాలు రెడీగా ఉన్నాయి. వీటిలో యూవీ క్రియేషన్స్ పై చేయాల్సిన సినిమా కూడా ఉంది. కాకపోతే ఇక్కడ సమస్య ఇది కాదు. అసలు చిరంజీవి కొత్త సినిమాను సెట్స్ పైకి తెచ్చే ఉద్దేశంలో ఉన్నారా లేదా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే చిరు బర్త్ డే కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాల్సిందే.