ఒక వైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రతిరోజూ పనిగట్టుకుని జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేస్తోంది. ఫ్యాక్షన్ తరహా పాలన సాగిస్తోందని జగన్ సర్కార్‌పై చంద్రబాబుతో పాటు టీడీపీ నాయకులంతా గొంతెత్తి అరుస్తున్నారు. మరోవైపు అందుకు విరుద్ధంగా అదే ప్రతిపక్ష టీడీపీ యువనాయకుడు ఏకంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దౌర్జన్యంగా తమ అనుచరుడిని బయటికి తీసుకెళ్లి పోవడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటు చేసుకున్న ఈ సంఘటన జగన్ సర్కార్ మానం ప్రాణం తీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమ వుతున్నాయి. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డ సమీపంలోని పడగండ్ల గ్రామంలో కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ కౌన్సిలర్ శూలం నరసింహుడు ఆదివారం ప్రత్యర్థులపై దాడికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి భూమా అఖిలప్రియ తమ్ముడు, టీడీపీ యువనాయకుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తన అనుచరులతో కలిసి ఆళ్లగడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అడ్డొచ్చిన పోలీసులను పక్కకు తోసేశాడు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు శూలం నరసింహుడిని విడిపించుకుని తన వెంట తీసుకెళ్లాడు.
ఈ విషయమై పోలీసులు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసు ఉన్నతాధికారులు మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటివద్దకెళ్లి నిందితుడిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. కానీ ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ మంత్రి సోదరుడు అంత ధైర్యంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన అనుచరుడిని విడిపించుకెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అధికారంలో లేకపోయినా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. వైసీపీ సర్కార్ అసమర్థ పాలనకు ఇదో నిదర్శనమని ఆ పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకెళ్లిన జగత్‌విఖ్యాత్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు ఉండవా? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఒక వైపు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉండడంతో పాటు ఆళ్లగడ్డలో అత్యధిక మెజార్టీతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందాడు.
అలాంటిది ఘోరంగా ఓటమి పాలైన భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డలో హవా కొనసాగిస్తోందనడానికి ఈ ఘటనే నిలువెత్తు నిదర్శనం. వైసీపీ సర్కార్‌తో భూమా అఖిలప్రియకు లోపాయికారి ఒప్పందం ఉండటం వల్లే ఇంత బరితెగించారనే టాక్ వినిపిస్తోంది. పోలీసుల అసమర్థత వల్ల జగత్‌విఖ్యాత్‌రెడ్డి హీరో అయ్యాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.