జీవితంలో ఊహించని పరిణామాలు చూసే భాగ్యాన్ని చంద్రబాబుకు జగన్ కల్పించారు. ఏపీలో ఏది జరిగినా తాను అసలు ఊహించలేదని అనడం చంద్రబాబుకు పరిపాటైంది.
తాను అలా అనుకోలేదని, ఇలా అనుకోలేదని సమావేశాల్లో చెప్పడం చంద్రబాబుకు అలవాటైంది. మరి ఆయన ఏం ఊహించారో, అనుకోని ఘటనలు ఏం జరుగుతున్నాయో ఆయనకే తెలియాలి. చంద్రబాబుకు వెన్నుపోటు ఘటన కంటే అనూహ్య పరిణామం ఏదైనా వుందా? అంటే …ఆయన సమాధానం ఏం చెబుతారో తెలియదు.
టీడీపీ లీగల్ సెల్ నూతన కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ… ఎప్పట్లాగే ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమించివారిని గుర్తు పెట్టుకోవాలని ఆయన సూచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి వారి గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించడం గమనార్హం. తమ పార్టీకి 40 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు.
కానీ ఇలాంటి పనికిమాలిన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తన జీవితంలో ఎప్పుడూ ఊహించలేదని వాపోయారు. ఇన్నేళ్లలో ఏ సీఎం వ్యక్తిగతంగా ప్రవర్తించలేదని చెప్పారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామను ఏపీకి రాలేని పరిస్థితిని కల్పించారన్నారు. ఒక ఎంపీకే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితేంటి? అని ఆయన ప్రశ్నించారు. రఘురామకృష్ణంరాజు హద్దులు దాటి అవాకులు చెవాకులు పేలడం వల్లే ఆయన గుండెల్లో నిద్రపోయారని చంద్రబాబు గుర్తించినట్టు లేదు.
గతంలో తన పరిపాలనలో వేధింపులకు పాల్పడడం వల్లే నేడు ఈ దయనీయ స్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చంద్రబాబు పశ్చాత్తాపం చెందకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నాడు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను టీడీపీలో చేర్చుకోవడం చట్ట ఉల్లంఘనలోకి వస్తుందా? రాదా? అని ఒక్కసారి చంద్రబాబు తన అంతరాత్మను ప్రశ్నించుకుంటే, నేటి దుస్థితికి సమాధానం దొరుకుతుంది. పైగా ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యేని మంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. చేసిన తప్పులకు ఎవరైనా, ఎప్పుడైనా సమాధానం చెప్పి తీరాల్సిందే.
అదే ఇప్పుడు జరుగుతోంది. జగన్ ప్రభుత్వం తప్పులు చేసినా, రేపు అనుభవించాల్సి వుంటుంది. ఇందుకు ఎవరూ అతీతం కాదు. కానీ అధికారంలో వుంటే తప్పొప్పుల స్పృహ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఆ విషయంలో చంద్రబాబుకు బాగా కళ్లు మూసుకుపోయాయని అప్పట్లో టాక్. గుండెల్లో నిద్రపోతా లాంటి తాటాకు చప్పుళ్లకు భయపడరని గ్రహించి, తన పాలనలోని తప్పులను గుణపాఠాలుగా నేర్చుకుంటే చాలు.