ఎమ్మెల్యే వల్ల కాని పని, కార్యకర్తల వల్ల అవుతోంది

తెలుగుదేశం పార్టీలో గెలిచినోళ్ల కంటే.. ఓడినవారే ఎక్కువ అదృష్టవంతులు. పార్టీ మారాలంటే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని కండిషన్ పెట్టినప్పుడే ఈ విషయం రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. టీడీపీ కేడర్…

తెలుగుదేశం పార్టీలో గెలిచినోళ్ల కంటే.. ఓడినవారే ఎక్కువ అదృష్టవంతులు. పార్టీ మారాలంటే ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేయాలని కండిషన్ పెట్టినప్పుడే ఈ విషయం రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. టీడీపీ కేడర్ అంతా వైసీపీలోకి సర్దుకుంటోంది. గతంలో వైసీపీ తరపున గెలిచి, అధికార దాహంతో టీడీపీలో చేరిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు.. అందరూ తిరిగి వైసీపీ గూటికి చేరుకుంటున్నారు.

టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించినవారు కూడా ఇప్పుడు వైసీపీ బాట పట్టారు. పలు జిల్లాల్లో ఈ వలసలు కొనసాగుతున్నాయి. ముందు వెళ్లిన వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయనే ఆలోచనతో.. ఒకరి తర్వాత ఒకరు, ఒకరితోపాటు మరొకరు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. అయితే వీరికి అట్నుంచి ఎలాంటి రాజకీయ హామీలు లభించడంలేదని తెలుస్తోంది. అప్పటికే పార్టీలో ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామని మొహమాటం లేకుండా చెబుతున్నారు ఎమ్మెల్యేలు. అయినా సరే దూరదృష్టితో వీరంతా పార్టీ మారుతున్నారు.

ఓవైపు ప్రజాబలం కోల్పోయిన నేతలకు బీజేపీ కాషాయ కండువా కప్పి సంబపడుతుంటే.. మరోవైపు టీడీపీ క్యాడర్ ని వైసీపీ లాగేసుకుంటోంది. గతంలో పార్టీ ఓడిపోయినా కార్యకర్తలు మాత్రం బైటకు పోయేవారు కాదు. ఇప్పుడు నేతలే నిస్సిగ్గుగా పార్టీలు మారుతున్నవేళ, కార్యకర్తలు కూడా అధికార పార్టీ వైపు వెళ్లడానికి సంకోచించడం లేదు. అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల బలం పార్టీలకు చాలా ముఖ్యం. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీని ఖాళీ చేయాలని చూస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.

ఇందులో భాగంగా టార్గెట్ టీడీపీ ఆపరేషన్ చేపట్టారు వైసీపీ ఎమ్మెల్యేలు. చాపకింద నీరులా అందర్నీ లాగేసుకుంటున్నారు. ఇక్కడ వైసీపీ నేతల వ్యూహం కంటే.. టీడీపీ వారి అర్జెన్సీయే ఎక్కువగా కనిపిస్తోంది. వైసీపీ వాళ్లు పిలవకపోయినా వెళ్లి చేరిపోయే పరిస్థితులున్నాయి. కొంతమంది అధికారికంగా, మరికొంతమంది అనధికారికంగా వైసీపీకి వత్తాసు పలుకుతున్నారు. ఈ వలసలను చూసి గెలిచిన చోట టీడీపీ ఎమ్మెల్యేలు దిగాలుపడిపోయారు.

గెలిచినా తాము ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చిందనే బాధ కంటే.. అప్పటి వరకూ తమవెనక తిరిగిన అనుచరులు అధికార పార్టీ అంటూ కాలరెగరేస్తుండే వీళ్లకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. జగన్ నిర్ణయంతో ఎమ్మెల్యేలు కండువా మార్చలేకపోతున్నారు. కానీ కార్యకర్తలకు అలాంటి కండిషన్లు లేవు. ఫలితంగా కార్యకర్తలు తరలిపోతున్నారు, ఎమ్మెల్యే ఏకాకి అవుతున్నాడు.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!