మోదీజీ.. ఇది మీ ‘తొలి సెలవు’ ఎలా?

ఎలాంటి వ్యవహారాన్ని అయినా.. రక్తి కట్టించే పదజాలంతో… రమ్యంగా.. చెప్పడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. అందుకే ఆయన బేర్‌గ్రిల్స్ తో కలిసి జిమ్ కార్బెట్ పులుల అభయారణ్యంలో జరిపిన సాహసయాత్ర గురించి… చాలా విభిన్నంగా…

ఎలాంటి వ్యవహారాన్ని అయినా.. రక్తి కట్టించే పదజాలంతో… రమ్యంగా.. చెప్పడం ప్రధాని నరేంద్రమోడీ ప్రత్యేకత. అందుకే ఆయన బేర్‌గ్రిల్స్ తో కలిసి జిమ్ కార్బెట్ పులుల అభయారణ్యంలో జరిపిన సాహసయాత్ర గురించి… చాలా విభిన్నంగా చెప్పుకొచ్చారు. ఆ సాహసయాత్ర గురించి కొన్ని అనుమానాలు, విమర్శలు కూడా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. పాలనలో బాధ్యుడిగా.. తన నిర్వంతరాయ కర్తవ్య నిర్వహణ గురించి ఆయన పరోక్షంగా కితాబిచ్చుకున్నారు.

‘‘సాహసయాత్రకు వెళ్లడాన్ని వెకేషన్ గా భావిస్తే.. 18 ఏళ్లలో తాను తొలిసారిగా సెలవు తీసుకున్నాను’’ అని నరేంద్రమోదీ చెప్పుకున్నారు. ముఖ్యమంత్రిగా పన్నెండున్నరేళ్లు, ప్రధానిగా అయిదున్నరేళ్లు కలిపి… 18 ఏళ్లుగా ఆయన చెప్పుకున్నారు. ఇన్నేళ్ల సుదీర్ఘ వ్యవధిలో మొదటి సారి సెలవు తీసుకున్నానని జస్టిఫై చేసుకున్నారు. నిజమే కావొచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి కాలం సంగతి మనకు తెలియదు గానీ… ప్రధానిగా ఆయన తీసుకున్న సెలవుల గురించి సమాచారహక్కు ద్వారా ఒకరు ప్రధాని తీసుకున్న సెలవుల గురించి అడిగారు.

‘ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఇవాళ్టి వరకు ఎలాంటి సెలవులూ తీసుకోలేదు’ అని పీఎంఓ అందుకు సమాధానం ఇచ్చింది. ఇది రికార్డెడ్ సంగతి. ప్రధాని సెలవు తీసుకునే విధివిధానాల గురించి ఒకరు సమాచార హక్కు ద్వారా అడిగిన ప్రశ్నకు కూడా ఇలాంటి జవాబే వచ్చింది. ‘‘ప్రధాని మంత్రి సర్వవేళలా ఆన్ డ్యూటీ మీదనే ఉన్నట్లుగా చెప్పగలం’’ అన్నట్లుగా పీఎంఓ జవాబిచ్చింది. ప్రధాని ఇప్పుడు ‘‘సాహసయాత్రను సెలవుగా భావించేట్లయితే’’ అంటూ మెలిక పెడుతున్నారు.

నిజానికి పీఎంఓ చెప్పిన సమాధానాలనే నిజంగా భావించేట్లయితే.. ఇది కూడా సెలవు అనుకోనక్కర్లేదు. అలా కాకపోయినట్లయితే.. మోడీజీ… ఇది మీ ‘తొలిసెలవు’ ఎలా అవుతుంది? గతంలో మీరు అనధికారిక కార్యక్రమం అంటూ రిషీకేశ్ లో ఓ రోజంతా స్వామీజీతో గడిపినప్పుడు అది సెలవు మీద వెళ్లినట్లే ప్రజలు భావించారు. ఎన్నికల తుదివిడత పోలింగ్ తర్వాత.. ఓ రోజంతా వెళ్లి కేదార్‌నాథ్ గుహల్లో ధ్యానం చేసుకుంటూ కూర్చున్నప్పుడు కూడా ప్రజలు దానిని సెలవుగానే భావించారు.

ఆహ్వానం లేకపోయినా (ప్రోగ్రంలో లేకపోయినా)… హఠాత్ అతిథిగా మీరు పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట శుభకార్యానికి హాజరైనప్పుడు కూడా సెలవు అనే అనుకున్నారు. అలా ప్రజలకు తెలిసీ తెలియని సందర్భాల్లో మీరు సెలవులు తీసుకుంటూనే ఉన్నారు. ఈ సాహసయాత్ర మాత్రం తొలిసెలవు ఎలా అవుతుంది? అని ప్రజలు విస్తుపోతున్నారు.

ప్రాంతీయ భాషల సినిమాలు అదుర్స్!