ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ రాజధాని కావాలనే డిమాండ్‌పై విశాఖ గర్జన నినాదంతో ఈ నెల 15న ఆ నగరంలో భారీ సభ నిర్వహించనున్నారు. ఇదే సమయంలో అక్కడికి జనసేనాని పవన్‌కల్యాణ్ విశాఖ వెళ్లాలని అనుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. విశాఖలో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించడానికే పవన్ వెళ్తున్నారనేది అధికార పార్టీ నేతల ఆరోపణ. విశాఖలో మరో రోజు పవన్ పర్యటించాలనే డిమాండ్లను ఆయన లెక్క చేయకపోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో మూడు రాజధానులపై మంత్రి ఆర్కే రోజా తన మార్క్ పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ బిడ్డగా కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటును స్వాగతిస్తున్నట్టు చెప్పారు. పెయిడ్ ఆర్టిస్టులతో చంద్రబాబు అమరావతి ఉద్యమాన్ని చేయిస్తున్నారని మండిపడ్డారు. దొంగ రైతులతో ఉద్యమాన్ని నడుపుతూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖ గర్జన సభకు మద్దతు ఇస్తున్నట్టు రోజా తెలిపారు. గర్జన సభను పక్కదోవ పట్టించేందుకే పవన్‌కల్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమై, ఇప్పుడు ఆయన ఆరాధ్య దైవం అనడం సిగ్గు చేటన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటే చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను ప్రజలు తరిమికొడ్తారని రోజా తీవ్ర హెచ్చరిక చేయడం గమనార్హం. మూడు రాజధానులకు అనుకూలంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తలకెత్తుకుంది.
దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మూడు రాజధానులకు అనుకూలంగా, అమరావతికి వ్యతిరేకంగా ఎదురు దాడికి దిగారు. మూడు రాజధానుల వల్ల తమకు కలిగే ప్రయోజనాల్ని జనానికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర సంపదనంతా కేవలం 29 గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలనే చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాల్ని వివరిస్తున్నారు.