మన పట్ల ఎదుటి వాళ్లు ఎలా ఉండాలని కోరుకుంటామో, మనం కూడా అవతలి వారి విషయంలో అంతే మర్యాదగా ఉంటే ఏ గొడవా వుండదు. అదేంటో గానీ… మర్యాదకు, వైసీపీ రెబల్ ఎంపీకి అసలు కుదరనట్టుంది.
ఆయన గారి వ్యవహారం ఎట్లా ఉంటుందంటే…”నేను గిల్లుతా, మీరు కెవ్వుమని ఏడ్వండి. అంతే తప్ప, నన్నెవరూ ఏమీ అనగూడదు” అనేలా వ్యవహరిస్తుంటారు. ఇదేం పద్ధతయ్యా పెద్ద మనిషి అని ఎవరైనా ప్రశ్నిస్తే… ‘రాజు’ తలచుకుంటే కొరడా దెబ్బలు కరువా? అనే సామెత చెబుతారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… సదరు నాయక శిఖామణి గారి హాస్యం కాస్త అపహాస్యం కావడం వల్లే.
ఢిల్లీలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ జబర్దస్త్ కామెడీని మించిపోయేలా డైలాగ్స్ చెప్పారు.
‘నరసాపురంలో జగన్, నేను పోటీ చేస్తే ఎలా ఉంటుందని సర్వే చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏమవుతుందో సర్వేలో తేలింది. జగన్‌కు, నాకు మధ్య 19 శాతమే వ్యత్యాసం, తప్పుడు ప్రచారం ఆపేందుకు సర్వే వివరాలు చెప్పా. చెవిరెడ్డి, పెద్దిరెడ్డి, చంద్రబాబుకు 60శాతం ప్రజల మద్దతు ఉంది’ అని సారు గారు చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో కేఏ పాల్, బండ్ల గణేష్, నారా లోకేశ్‌లను మించిపోయేలా ఉన్నారని ..సదరు నేత మాటలు విన్నవారు చెబుతున్నారు. వారి వారసుడిగా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. హాస్యం ఒకరబ్బని సొత్తు కాదు కదా! కాకపోతే, తాను అపహాస్య పాలవుతున్న విషయం ఆయనకు తెలుసో లేదో మరి!