తన హయాంలో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని సంతలో పశువుల్ని కొన్నట్టు కొనేశారు చంద్రబాబు. వాళ్లలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చి వలసల్ని ప్రోత్సహించారు. ప్రతి ఎమ్మెల్యే జంప్ అయిన టైమ్ లో వైసీపీ ఒకటే డిమాండ్ చేసేది. నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లి సైకిల్ గుర్తుపై గెలవాలని సవాల్ విసిరేది. కానీ ఆ డిమాండ్ ను అప్పటి వలస మంత్రులు, చంద్రబాబు ఎవ్వరూ పట్టించుకోలేదు. నిస్సిగ్గుగా గోడ దూకేశారు, టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వారిలో ఒక్కరంటే ఒక్కరూ గెలవలేకపోయారు.
కట్ చేస్తే, ఇప్పుడు వైసీపీది అధికారం, జగన్ దే రాజ్యం. కావాలనుకుంటే జగన్ కూడా వలసల్ని ప్రోత్సహించొచ్చు. కానీ ఆ పెయిన్ ఏంటో జగన్ కు బాగా తెలుసు. పైగా రాజకీయాల్లో మార్పురావాలంటూ పదేపదే చెప్పిన జగన్, వలసల్ని ప్రోత్సహించరు. అయినప్పటికీ జగన్ పై ఇష్టంతో, వైసీపీ భావజాలం నచ్చి టీడీపీ నుంచి కొంతమంది ఫ్యాన్ కిందకొచ్చారు. సరిగ్గా ఇక్కడే టీడీపీ అడకత్తెరలో పడింది. గతంలో వైసీపీ చేసిన డిమాండ్ ను ఇప్పుడది చేయలేకపోతోంది.
వైసీపీకి మద్దతిచ్చిన టీడీపీ ఎమ్మెల్యేల్ని రాజీనామాలు చేసి ఫ్యాన్ గుర్తుపై గెలవాలని టీడీపీ డిమాండ్ చేయలేకపోతోంది. ఎందుకంటే, ఆ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం తమ పరిస్థితేంటనేది టీడీపీకి బాగా తెలుసు. పైగా వీళ్ల డిమాండ్ కు ఒప్పుకొని జగన్ నిజంగానే వాళ్లతో రాజీనామాలు చేయించి, ఆ నలుగుర్ని గెలిపించుకుంటే.. అప్పుడిక టీడీపీ పరువు గంగలో కలవడం ఖాయం. అందుకే వాళ్లను రాజీనామా చేయమని అడగలేక, అలా అని వదిలేయలేక తెగ ఇబ్బంది పడుతోంది టీడీపీ.
నిజానికి ఆ నలుగురికి మాత్రం రాజీనామా చేయాలనే ఉంది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడే వైసీపీకి మద్దతిచ్చారు వాళ్లు. ఫ్యాన్ గుర్తుపై తిరిగి గెలుస్తామనే నమ్మకం కూడా ఉండబట్టే ఆ పని చేశారు. ఈ విషయం తెలుసుకాబట్టే టీడీపీ తేలుకుట్టిన దొంగలా మారిపోయింది.
అదే జరిగితే నలుగురితో ఆగిపోతారా..?
టీడీపీ నిజంగానే వైసీపీకి సవాల్ విసిరితే, వైసీపీ దర్జాగా దాన్ని ఒప్పుకుని తమ మద్దతుదారులతో రాజీనామా చేయిస్తుంది. ఇప్పుడున్న లెక్క ప్రకారం గతంలోకంటే ఎక్కువ మెజార్టీతో వారు కచ్చితంగా గెలుస్తారు. అయితే ఇక్కడే మరో సమస్య ఉంది. రాజీనామాలకు సిద్ధపడినవారిని చూసి మిగతావాళ్లు ఆగుతారా..? ఆ ఊపు వచ్చిందంటే టీడీపీ కచ్చితంగా ఖాళీ అవుతుంది. చంద్రబాబు, బాలయ్య మినహా ఇంకెవరూ పార్టీలో ఉండరేమో అన్నంత పరిస్థితి వస్తుంది. అందుకే టీడీపీ ఆ డిమాండ్ ని వదిలేసింది.
గతంలో అమరావతి కోసం రాజీనామాలు చేద్దాం, కనీసం ఆ రెండు జిల్లాల నాయకులైనా రాజీనామాలు చేసి రాజధాని రెఫరెండంతో ఎన్నికలకు వెళ్దాం అని చెప్పుకొచ్చిన టీడీపీ.. కనీసం ఇప్పుడు రెబల్స్ కి సవాల్ విసిరే స్థితిలో కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితిని టీడీపీ నాయకులు కలలో కూడా ఊహించి ఉండరు.