తెలంగాణలో మోగుతున్న దళిత మంత్రం

తెలంగాణలో కొంత కాలంగా దళిత మంత్రం మారుమోగుతోంది. దళిత నామ స్మరణ జరుగుతోంది. దళిత మంత్రం ఎందుకు మోగుతున్నదో, దాని నేపథ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. దళిత మంత్రంతో ఎగిరెగిరి పడుతున్న ప్రతిపక్షాలను మట్టి…

తెలంగాణలో కొంత కాలంగా దళిత మంత్రం మారుమోగుతోంది. దళిత నామ స్మరణ జరుగుతోంది. దళిత మంత్రం ఎందుకు మోగుతున్నదో, దాని నేపథ్యం ఏమిటో అందరికీ తెలిసిందే. దళిత మంత్రంతో ఎగిరెగిరి పడుతున్న ప్రతిపక్షాలను మట్టి కరిపించవచ్చని, తనకు శత్రువుగా మారిన ఈటల రాజేందర్ మీద పగ తీర్చుకోవచ్చని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. టీఆర్ఎస్ ను ఓడగొట్టి చరిత్ర సృష్టించాలని ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. 

హుజూరాబాద్ ఉప ఎన్నిక రాజకీయంగా కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుండగా, చివరకు కేసీఆర్ దీన్ని ఖరీదైన ఉప ఎన్నికగా మార్చేశారు. ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఆయన వెనుకాడటంలేదు. తెలంగాణా రాష్ట్రం సిద్ధించిన 2014 నుంచి ఇప్పటివరకు దళితుల గురించి  ఇంతపెద్దఎత్తున చర్చ జరగలేదు. దళిత అజెండాగా ఉప ఎన్నిక జరిగిన దాఖలా లేదు. ఇంత డబ్భు ఖర్చు చేసింది లేదు. ఇంత తీవ్రంగా విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్న సందర్భం లేదు.

దళితుల అంశంపై కేసీఆర్ ఎప్పుడూ ఇన్ని విమర్శలు ఎదుర్కోలేదు. హుజూరాబాద్ లో గెలుపు కోసమే ఆయన ఇప్పటివరకు చేయని ఎన్నో పనులు చేయాల్సి వచ్చింది.  ఈ నేపథ్యంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయినా ఆయన లెక్క చేయకుండా తాను చేసిన పనులను సమర్ధించుకుంటున్నారు. ఆయన చేసిన పనులు కొందరు టీఆర్ఎస్ నాయకులకే కోపం తెప్పిస్తున్నాయి. అయినా ఏం మాట్లాడలేని పరిస్థితి. ఇక కేసీఆర్ తన దళిత ఎజెండాను మరింత పటిష్టం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇందుకు కారణం కేసీఆర్ దళితులకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఇప్పటివరకు వారిని పట్టించుకోలేదని విమర్శలు రావడమే. ఇప్పుడు కేవలం హుజూరాబాద్ ఉప ఎన్నిక వరకే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం చేసుకునే విధంగా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. 

హుజూరాబాద్ ఎన్నికలకు ముందే తెలంగాణలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. దళిత బంధు పథకం కేంద్రంగా ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు.. మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని తెలుస్తోంది. కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. తెలంగాణ మంత్రివర్గంలో మొన్నటి వరకు సీఎం కేసీఆర్ సహా మొత్తం 17మంది మంత్రులు ఉన్నారు.

భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ప్రస్తుతం తెలంగాణ కేబినెట్‌లో 16 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో  ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్‌ మాత్రమే ఉన్నారు. ఎన్నికల కోసమే దళిత బంధు తెచ్చారని.. ఏడేళ్లుగా దళితులను మోసం చేస్తున్నారని, కేబినెట్‌లో దళితులకు ప్రాధాన్యత లేదని విపక్షాలు చేస్తుండటంతో మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా దళితులకు పట్టం కట్టలేదన్న అపవాదును తొలగించుకోవాలన్నది ఆయన ప్లాన్. దీనిలో భాగంగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక కంటే ముందుగానే  కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 18 మంది టీఆర్‌ఎస్‌ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మంది మాల, 9 మంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. త్వరలో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో వీరిలో నుంచి కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని సమాచారం. 

ముఖ్యంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. వీరిలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి రావొచ్చని సమాచారం. అంతేకాక ‘దళితబంధు’ పథకానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్‌ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. 

మోత్కుపల్లి నర్సింహులు ఇటీవలే బీజేపీకి రాజీనామా చేశారు. దళిత బంధు పథకం బాధ్యతలను ఆయనకు అప్పజెప్పుతారని సమాచారం. ఇటీవలి కాలంలో తీన్మార్ మల్లన్న, వైఎస్ షర్మిల, ప్రవీణ్ కుమార్, ఈటల రాజేందర్ వంటి నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి.. ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ నిర్ణయాలతో వారిందరికీ చెక్ పెట్టాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది.

కేసీఆర్ ఏ అంశం తీసుకున్నా అంతా దాని మీదనే చర్చ జరిగేలా చేయటం ఆయనకు అలవాటే. రాష్ట్రంలో ఏదైనా అంశాన్ని ఎజెండా చేయాలంటే ఆయనకు మించినోళ్లు ఉండరు. నిజానికి ఇలాంటి పని గతంలో ప్రజా సంఘాలు.. ఉద్యమ నాయకులు.. మీడియాలు చేసేవి. ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ కు ఎప్పుడు ఏ ఇష్యూను తెర మీదకు తీసుకు రావాలి? దాన్ని ఎజెండాగా మార్చాలన్న దానిపై ఉన్నంత క్లారిటీ మరెవరికీ ఉండదు. దళితుల మనసుల్ని దోచుకునేందుకు ఆయన వేస్తున్న ఎత్తులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఏడేళ్ల తన పాలనలో ఇప్పుడు ఒక్కసారిగా దళితుల అంశాల్ని తెచ్చిన ఆయన.. వారి కోసం విపరీతంగా తాను తపిస్తున్న భావనను కలుగజేస్తున్నారు.  నిజంగానే అంత ప్రేమ ఉండి ఉంటే.. పవర్లోకి వచ్చిన ఈ ఏడున్నరేళ్లు ఏం చేస్తున్నట్లు? అన్నది మరో ప్రశ్న.

గతంలోనూ తాను ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన పథకాల మీద ఇలాంటి పరిస్థితినే తీసుకువచ్చారు.  ఉచిత గొర్రెల పంపిణీతో.. రానున్న కొద్ది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంత ధనిక రాష్ట్రంగా మారుతుందనే  విషయాన్ని గణాంకాలతో వివరించేవారు. మరి.. గొర్రెల పథకం ఏమైంది? ప్రస్తుతం దళిత నినాదాన్ని తీసుకున్న సీఎం కేసీఆర్ కు ప్రముఖ న్యాయవాది..హక్కుల నేత దివంగత బొజ్జా తారకం గుర్తుకు వచ్చారు. ఆయన కుమారుడైన ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాను సీఎంవో కార్యదర్శిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎంవోలో మొదటి దళిత అధికారి. సీఎంఓలో ఇప్పటివరకు దళిత ఐఏఎస్ అధికారులు లేరు. ప్రతిపక్షాలనుంచి విమర్శలు వచ్చాకే కేసీఆర్ రాహుల్ బొజ్జాను నియమించారు. 

నువ్వా నేనా అన్నట్లుగా తెలివిని ప్రదర్శిస్తున్న తెలంగాణ రాష్ట్ర నేతల తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ మాటలతో ఒకరిని ఒకరు ఇబ్బందులకు గురి చేసుకోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దళితబంధు కోసం తొలుత  500  కోట్లు కేటాయించినట్లు చెప్పిన కేసీఆర్  తర్వాత రూ.2వేల కోట్లు కేటాయించేసి మరో సంచలనానికి తెర తీశారు. ఆయన దత్తత గ్రామం వాసాలమర్రిలో మాదిరి హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తం పంచేందుకు వీలుగా కసరత్తు జరుగుతోంది. ఇదిలా ఉంటే…. దళిత బంధు పథకంతో అంతకంతకూ పెరుగుతున్న ఇమేజ్ కు చెక్ పెట్టేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడు కొత్త ఆటకు తెర తీశారు.

బీజేపీ నేతలంతా గ్రామాలకు వెళ్లి ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పిన రూ.10లక్షల మొత్తాన్ని పొందేందుకు వీలుగా అప్లికేషన్లు పెట్టాలని.. దానికి సంబంధించిన ఫిర్యాదుల్ని ప్రత్యేకంగా సేకరించి.. ప్రభుత్వానికి నిద్రలేకుండా చేయాలన్న ఆలోచనలో బండి సంజయ్ ఉన్నారు. అందుకే.. దళితబంధు పథకానికి తమ పేర్లను నమోదు చేసుకోవాలంటూ ఆయన కొత్త తరహా ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున దరఖాస్తుల్ని సేకరించటం ద్వారా.. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారని  వినిపిస్తోంది.

బండి చేపట్టిన ప్రోగ్రాంతో కొత్త సమస్యలు తెర మీదకు వస్తాయని గుర్తించిన మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఆయన ప్రజాకోర్టులో కౌంటర్ వేసే కార్యక్రమాన్ని షురూ చేశారని చెప్పాలి. ఎన్నికల సమయంలో ప్రధాని మోడీ ప్రతి ఒక్క పేద కుటుంబానికి రూ.15లక్షల మొత్తాన్ని వారి ఖాతాల్లో వేస్తానని గొప్పలు చెప్పుకున్నారని, ఇప్పుడా పని ఎందుకు చేయట్లేదన్న అడిగారు. 2014 ఎన్నికలకు ముందు ప్రతి పేదోడి ఖాతాకు రూ.15లక్షల మొత్తాన్ని జమ చేస్తానని మోడీ చెప్పారంటూ మంత్రి కేటీఆర్ ఇప్పుడు సరికొత్త మాటను చెబుతున్నారు.

దళితబంధులో భాగంగా ఇచ్చే రూ.10లక్షల కోసం పెట్టాల్సిన దరఖాస్తును.. ప్రధాని మోడీ ఇస్తానని చెప్పిన రూ.15లక్షల కోసం అప్లికేషన్ ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఇవ్వాలంటున్నారు. బండి షురూ చేసిన ఉద్యమాన్ని ఆయనకే చేటు తెచ్చేలా మంత్రి కేటీఆర్ ప్లానింగ్ ఉందని చెప్పక తప్పదు. మరోపక్క తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దళిత గిరిజన దండోరా పేరుతో సభలు నిర్వహిస్తూ కాక పుట్టిస్తున్నారు. మొత్తంమీద దళిత అజెండా కారణంగా తెలంగాణా చాలా హాట్…హాట్ గా ఉంది. 

-నాగ్ మేడేపల్లి