కోవిడ్-19 నివారణ కోసం తప్పనిసరిగా వ్యాక్సిన్ ను వేయించుకోవడాన్ని తప్పుపట్టడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. వ్యాక్సిన్ తప్పనిసరి. ప్రభుత్వాల సూచన మేరకు రెండు డోసుల వ్యాక్సిన్ అందరికీ జరగాలి. ఈ విషయంలో ప్రజల చొరవ కూడా కీలకం. మనదేశంలో వీలైనంత త్వరగా వయోజనులందరికీ వ్యాక్సినేషన్ జరగాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం. ఇదే సమయంలో.. వ్యాక్సినేషన్ తర్వాత ఏమిటి? అనే అంశం గురించి కూడా అధ్యయనాలు జరగాలి.
వ్యాక్సినేషన్ తర్వాత కరోనా ప్రభావం గురించి ల్యాబుల్లో ఎలాంటి పరిశోధనలు జరుగుతున్నాయో కానీ, మెరుగైన స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగిన దేశాల్లోని పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. వ్యాక్సినేషన్ సమర్థత గురించి కూడా అది ఒకరమైన చర్చ అవుతుంది. ఇందుకు ఒక ఉదాహరణగా యూనైటెడ్ కింగ్డమ్ లోని పరిస్థితులను ప్రస్తావించవచ్చు.
ఈ వ్యాసం రాసే సమయానికి.. యూకే పరిధిలో సుమారు 70శాతం మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ జరిగింది. అదే పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పొందిన వారి శాతం దాదాపు 60కు పైనే ఉంది. ఎంతో కొంత.. పరిమిత స్థాయి జనాభా ఉన్న దేశం కావడం, మెరుగైన వైద్య సదుపాయాలు, సంపన్నమైన ఆర్థిక వ్యవస్థ.. ఈ కారణాలతో అక్కడ వ్యాక్సినేషన్ వేగంగా జరిగింది.
వ్యాక్సిన్ రూపకల్పనలో కూడా బ్రిటన్ కంపెనీలే ముందడుగు వేశాయి. మన దేశంలో విరివిగా ఉపయోగిస్తున్న వ్యాక్సిన్ కూడా యూకే పరిధిలో కనుగొన్నదే. ఇలాంటి పరిణామాలు అన్నీ.. యూకే జనులకు వ్యాక్సిన్ భారీ ఎత్తున అందుబాటులో రావడానికి కారణం అయ్యాయి. ఇక ప్రజలు కూడా ముందుకు రావడంతో వ్యాక్సినేషన్ విజయవంతంగా సాగింది, సాగుతోంది. దాని జనాభాతో పోలిస్తే.. ఇలా భారీ ఎత్తున వ్యాక్సినేషన్ జరిగిన దేశంలో కరోనా కేసుల పరిస్థితి ఏమిటనేది.. పరిశీలించాల్సిన అంశం. ఈ విషయంలో మాత్రం ఇప్పుడు యూకే మళ్లీ కరోనా తీవ్రత ఎక్కువగా నమోదవుతున్న దేశంగా నిలుస్తూ ఉండటం గమనార్హం!
యూకేలో గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెద్ద ఎత్తునే నమోదవుతూ ఉంది. జూలై నెల మధ్యలో యూకేలో భారీ ఎత్తున కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో గరిష్టంగా ఒకే రోజు 50 వేల స్థాయిలో కేసులు వచ్చాయి. ఆ తర్వాత ఆ స్థాయి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇక గత వారంలో యూకే పరిధిలో సగటున రోజుకు 30 వేల స్థాయిలో కేసులు వచ్చాయి! యూకే జనాభాతో పోలిస్తే.. ఈ స్థాయి కేసుల సంఖ్య కాస్త ఎక్కువే! వంద కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో కరోనా సెకెండ్ వేవ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడు రోజుకు ఐదు లక్షల స్థాయిలో కేసులు రావడం.. యూకే పరిధిలో రోజుకు ముప్పై, నలభై వేల స్థాయిలో కేసులు రావడం దాదాపు ఒకే తరహా పరిస్థితే!
మామూలుగా ఏదైనా దేశంలో ఈ స్థాయిలో కేసులు వస్తే అదంత పెద్ద విషయం కాదేమో! అయితే.. 70శాతం ప్రజలకు కనీసం ఒక డోసు, దాదాపు 60శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ జరిగిన దేశంలో దాని జనాభాకు అనుగుణంగా భారీ స్థాయిలో కేసులు వస్తూ ఉండటం.. గమనించాల్సిన అంశమే!
మరి ఇందుకు కారణాలు ఏమిటి? అనే అంశం గురించి కూడా పరిశీలిస్తే, పలు అంశాలను ప్రస్తావించవచ్చు. అందులో ముఖ్యమైనది, ఇప్పుడు యూకే పరిధిలో పెద్దగా ఆంక్షలు లేవు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి అనే నియమాన్ని కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. లండన్ లో జరిగిన ఇండియా-ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ కు వేల సంఖ్యలో ప్రజలు ఐదు రోజుల పాటు హాజరయ్యారు. అయితే వారిలో ఎవ్వరికీ మాస్కులు కనిపించలేదు. టీవీలో మ్యాచ్ ను చూస్తున్న భారతీయులకు.. కరోనాకు పూర్వపు రోజులను గుర్తు చేశారు ఆ మ్యాచ్ కు హాజరైన వాళ్లు! వ్యాక్సినేషన్ ఇచ్చిన విశ్వాసంతో బ్రిటీషర్లు మాస్కులనూ గట్రా పూర్తిగా పక్కన పెట్టేశారని అలా స్పష్టం అవుతోంది.
అదే సమయంలో..మెరుగైన వైద్య సదుపాయాల దేశం కావడంతో, అనుమానితులకు టెస్టులను నిర్వహించడం ఎక్కువగా జరుగుతుండవచ్చు. పరీక్షలు మెరుగైన స్థాయిలో జరిగే దేశం కావడం వల్ల కూడా కేసులు వెంటనే బయటపడుతూ ఉండవచ్చు. అలాగే వ్యాక్సినేషన్ జరిగిన వెంటనే కరోనా తగ్గిపోదనే సందేశాన్ని కూడా ఇస్తోంది యూకే.
మన దేశంలో కూడా ఒక డోసు వ్యాక్సిన్ పొందిన అనేక మందికి ఆ తర్వాత కరోనా సోకిన దాఖలాలు బోలెడున్నాయి. అలాగే రెండు డోసుల వ్యాక్సిన్ తర్వాత కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్న వారూ ఉన్నారు! ఇదే తరహాలో ఇప్పుడు యూకేలో జరుతుండవచ్చు. వ్యాక్సిన్ వల్ల కరోనా రాదని చెప్పలేమని, ప్రభావం మాత్రమే తక్కువగా ఉంటుందని కొందరు వైద్య పరిశోధకులు చెప్పడాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించవచ్చు.