ఈరోజు ఉదయం నుంచి సామాన్యులకు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం ప్రారంభమైంది. ఈరోజు 3వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 6.30 ప్రారంభమైన దర్శనాల్ని సాయంత్రం 7.30 నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారు. ట్రయల్ రన్ లో భాగంగా నిన్న 7200 మందికి దర్శనాలు కల్పించారు అధికారులు. ఆ అనుభవంతో ఈరోజు 3వేల మందికి దర్శనాలు కల్పించడం పెద్ద సమస్య కాదంటున్నారు.
ప్రతి భక్తుడ్ని థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తున్నారు. అంతేకాదు, కేవలం టిక్కెట్ ఉన్న భక్తుల్ని మాత్రమే తిరుమల పైకి అనుమతిస్తున్నారు. దీనికితోడు మాస్క్ తప్పనిసరి. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో ఉన్న వాళ్లు దర్శనాలకు రావొద్దని ఇప్పటికే విజ్ఞప్తి చేసిన టీటీడీ, ముందుజాగ్రత్త చర్యగా స్విమ్స్ లో కోవిడ్ ల్యాబ్ ను ఏర్పాటుచేసింది. కొండపైకి వచ్చిన వాళ్లలో ర్యాండమ్ గా 200 మందికి ఇక్కడ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
ఆన్ లైన్ లో పెట్టిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా ఇప్పటికే ముగిసింది. 30వ తేదీ వరకు ఆ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. 30 గంటల్లో 60వేల ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముడుపోయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన సర్వదర్శనం ఉచిత టోకెన్లకు కూడా విపరీతంగా డిమాండ్ ఏర్పడింది.
ముందుగా 3వేల టిక్కెట్లు ఇవ్వాలని టీటీడీ నిర్ణయించినప్పటికీ.. డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రోజుకు 750 టోకెన్లను పెంచి 3750 సర్వదర్శనం ఉచిత దర్శన టోకెన్లను 14వ తేదీ వరకు అందించింది. ఈరోజు ప్రారంభమైన దర్శనాల్లో ఇప్పటికే వీఐపీ దర్శనాలు ముగిశాయి. ప్రస్తుతం సాధారణ భక్తులకు దర్శనభాగ్యం కలుగుతోంది. ప్రతి మలుపులో శానిటైజర్లు ఏర్పాటుచేయడంతో పాటు, భక్తులు భౌతికదూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబందించి అదనంగా వాలంటీర్లను కూడా నియమించుకున్నారు.
14వ తేదీ వరకు పరిస్థితిని సమీక్షించి, ఆ తర్వాత నుంచి రోజువారీ కేటాయించే టోకెన్లు, టిక్కెట్ల సంఖ్యను పెంచుతామని టీటీడీ ప్రకటించింది.