తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక పోరు రాజుకుంటూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం అభ్యర్థి పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. ఇక ప్రచారం ఊపందుకోవాల్సి ఉంది. మరి ప్రచార పర్వంలో.. ఎలాంటి మెరుపులు ఉంటాయనేది చాలా ఆసక్తిదాయకమైన అంశం.
ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఎలాంటి విన్యాసాలు చేస్తారనేది చర్చనీయాంశంగా మారుతోంది. తెలుగుదేశం పార్టీ స్టార్ క్యాంపెయినర్లు ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్, చంద్రబాబు వియ్యంకుడు కమ్ లోకేష్ మామ, సినిమా హీరో బాలకృష్ణలు తెలుగుదేశం పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా తిరుపతిని ఊపేసే అవకాశాలున్నాయి.
ఇక లోకేష్, బాలయ్యల ప్రచారం మాటెలా ఉన్నా… వారు జనాల మధ్యకు వచ్చి ఏం మాట్లాడతారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సారి నారా లోకేష్ ఏ రకంగా తెలుగుదేశం ఓటేయమని అంటారో, తెలుగుదేశానికి ఓటేస్తే తిరుపతి జనాల పరిస్థితి ఏమిటని చెబుతారో.. అక్కడి జనాలు విని తరించాలి.
ఇక బాలకృష్ణ కు జనాలను చూస్తే పూనకం వచ్చే సంగతీ తెలిసిందే. కన్ఫ్యూజన్ లో బాలకృష్ణ ఎవరిని తరుముతారో, ఎవరిని తురుముతారో! ఇటీవలి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా ప్రచార పర్వంలోనే బాలకృష్ణ తన చేయి దురుసును చూపించారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుపతికి వెళ్లి ప్రచారం చేస్తే ఎవరికి మూడుతుందో!
ఇక లోకేష్, బాలకృష్ణల ఎంట్రీ లేకుండా తిరుపతిలో టీడీపీ ప్రచారం పూర్తయ్యే ప్రసక్తే ఉండదని స్పష్టం అవుతోంది. వాళ్లు అక్కడకు వెళ్లాల్సిందే, ప్రచార ప్రహసనాన్ని పండించాల్సిందే. సోషల్ మీడియాకు కూడా కావాల్సింత పొలిటికల్ కామెడీ వీడియోలు అందే సమయం ఆసన్నమవుతున్నట్టుగా ఉంది.