సైరా తరువాత సరైన సినిమా చేతిలోకి రాకుండా వుంది దర్శకుడు సురేందర్ రెడ్డి. ధృవ లాంటి సక్సెస్ ఇచ్చినా, సైరా సినిమా అదంతా డెబిట్ చేసేసి మళ్లీ మొదటికి తెచ్చింది. దీంతో రకరకాల గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్ తో సినిమా అని మొన్నటి వరకు వినిపించింది. మధ్య మధ్యలో కాదు అఖిల్ తో సినిమా వుండొచ్చు అని వినిపించింది.
ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సర్ సినిమా చేయాలి. ఆ తరువాత ఎఫ్ 3 సినిమా చేయాలి. అంటే ఓ ఏడాది టైమ్ పడుతుంది. మరి అంత వరకు సురేందర్ ఏం చేస్తారు? అందుకే ఆయన ఇప్పుడు తన చూపు వేరే హీరో వైపు తిప్పినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తో మాంచి హిట్ కొట్టిన రామ్ పోతినేని ప్రస్తుతం రెడ్ సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ప్రస్తుతానికి ఏ కమిట్ మెంట్ లేదు.
అందుకే సురేందర్ దృష్టి రామ్ మీద పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ తో సినిమా చేయాలని దర్శకుడు మారుతి కూడా ప్రయత్నాల్లో వున్నారు. మరి రామ్ ఎవరి వైపు మొగ్గుతారో? ఫ్లాప్ ఇచ్చినా, కమర్షియల్ డైరక్టర్ అని సురేందర్ వైపు చూస్తారో? మాంచి ఫ్యామిలీ సినిమాల డైరక్టర్ అని హిట్ ఇచ్చిన మారుతి వైపు మొగ్గుతారో?