కేరళ సీఎం పినరయ్ విజయన్ కుమార్తె వీణ పెళ్లి కూతురుగా ముస్తాబు కానున్నారు. ఆమె డీఎప్‌వైఐ (డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు పీఏ మహ్మద్ రియాజ్‌ను వివాహం చేసుకోనున్నారు. వీళ్లిద్దరికి ఇది రెండో వివాహం. ఈ నెల 15న పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు.
రాజకీయాల్లో అతికొద్ది మంది విలువలతో కూడిన నేతల్లో పినరయ్ ఒకరు. అతి సాధారణ జీవితాన్ని గడిపే పినరయ్ అంటే ప్రత్యర్థులు కూడా ఎంతో గౌరవిస్తారు. పినరయ్ విజయన్, కమల విజయన్‌ల పెద్ద కుమార్తె వీణ. ఆమె బెంగళూరులో సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టారు.
ఇక పెళ్లి కొడుకు మహ్మద్ రియాజ్ విషయానికి వస్తే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనేక విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందారు. వృత్తి రీత్యా అడ్వకేట్ . ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత సీపీఎంలో క్రియాశీలక సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్‌కే రాఘవన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
రాజకీయ నేపథ్యం ఉన్న మహ్మద్ రియాజ్‌ను సీఎం కుమార్తె పెళ్లాడుతుండటం విశేషం. అయితే లాక్‌డౌన్ నిబంధన లుండటంతో ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకూడదని నిశ్చయించుకున్నారు. తిరువనంతపురంలో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వివాహాన్ని జరిపించాలని పినరయ్ విజయన్ భావిస్తున్నట్టు సీఎం సన్నిహితులు చెబుతున్నారు.