తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి తనయుడు లోకేష్ కు తన గురించి మాట్లాడే స్థాయి లేదని అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత కరణం బలరాం. తన గురించి లోకేష్ అయినా, చంద్రబాబు నాయుడు అయినా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని కరణం బలరాం తీవ్రంగా ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరు కరణం బలరాం. టీడీపీ 10 యేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీలోనే ఆయన కొనసాగారు. అనేక కష్టనష్టాలను అక్కడే ఓర్చి నిలిచారు. పార్టీ తరఫున అనేక మంది సీనియర్లు, చంద్రబాబు నాయుడి తనయుడు కూడా ఓడిపోయిన ఎన్నికల్లో కరణం బలరాం నెగ్గి వచ్చారు. అయితే ఆయన ఇప్పుడు టీడీపీ అసమ్మతి స్వరం వినిపిస్తూ ఉన్నారు.
పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు టీడీపీని వీడటానికి రెడీగా ఉన్నారని ఇటీవలే ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల పట్ల లోకేష్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా ఉన్నారు. ఈ క్రమంలో లోకేష్ కు తన గురించి మాట్లాడేంత స్థాయి లేదని కరణం బలరాం తేల్చి చెప్పారు. కష్టకాలంలోనూ పార్టీ వెంట నిలిచి, అంతా ఓడిన సమయంలో నెగ్గిన తన గురించి లోకేష్ లాంటి ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్లకు మాట్లాడేందుకు ఏం అర్హత ఉందనేది కరణం బలరాం ప్రశ్న కావొచ్చు.
చంద్రబాబు నాయుడు మానసికంగా తనను ఎంతగానో ఇబ్బంది పెట్టారని కరణం అంటున్నారు. అవసరానికి వాడుకుని వదిలేశారని అంటున్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో గొట్టిపాటి వర్గం చేరికను కరణం బలరాం గట్టిగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు నాయుడు లెక్క చేయలేదు. ఇప్పుడు కరణం తెలుగుదేశం పార్టీని వీడటానికి 10 మందికి పైగా ఎమ్మెల్యేలతో సహా సీనియర్ నేతలు పలువురు రెడీగా ఉన్నారని మరోసారి తేల్చి చెప్పారు.