కరోనా టైమ్ లో దర్శకులు అంతా తమ తమ స్క్రిప్ట్ ల మీదే ఎక్కువ వర్క్ చేసారు. పూరి జగన్నాధ్ కూడా అంతే. ఇదే టైమ్ లో ఆయన ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ కాకుండా మరో మాంచి స్క్రిప్ట్ నురెడీ చేసారు. బాలీవుడ్ యంగ్, న్యూ జనరేషన్ హీరో కోసం అది తయారుచేసినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే ఎప్పటి నుంచో ఆయన మదిలో వున్న జనగనమణ సినిమా స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది.
అప్పట్లో ఆయన ఇది మహేష్ బాబు కోసం అనుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్లకు వాళ్లకి అని కాకుండా, ముందు బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయాలని కూర్చుని, ఆ పని ఫినిష్ చేసారు. భారత దేశంలో అవినీతి జాఢ్యం నేపథ్యంలో ఈ జనగనమణ కథ వుంటుంది. ఓ విధంగా శంకర్ భారతీయుడు సినిమాకు అప్ డేట్ వెర్షన్ అనుకోవాలేమో?
ఈ స్క్రిప్ట్ మొత్తం మన వ్యవస్థలో లోపాలు, డొల్లతనం మీద చాలా పవర్ ఫుల్ డైలాగులు వుంటాయని తెలుస్తోంది. అయితే ఈ స్క్రిప్ట్ ను మరి ఎవరికి చెబుతారా? ఏం చేస్తారో తెలియదు. ఆ మధ్య మహేష్ బాబు తన అభిమానులతో ముచ్చటిస్తూ పూరి జగన్నాధ్ ఎప్పుడు కథ చెబుతారా? అని చూస్తున్నా అన్నారు. మరి పూరి మళ్లీ ఈ జనగనమణ స్క్రిప్ట్ ను మహేష్ దృష్టికి తీసుకెళ్తారా? ఏమో? చూడాలి.