ప్రముఖ మ‌హిళా మావోయిస్టు లొంగుబాటు

ప్ర‌ముఖ మావోయిస్టు, ప్ర‌సిద్ధ ర‌చ‌యిత ఆలూరి భుజంగ‌రావు త‌న‌య ఉషారాణి ఇవాళ హైద‌రాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స‌మ‌క్షంలో ఆమె జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోయారు. ఈ సంద‌ర్భంగా డీజీపీ…

ప్ర‌ముఖ మావోయిస్టు, ప్ర‌సిద్ధ ర‌చ‌యిత ఆలూరి భుజంగ‌రావు త‌న‌య ఉషారాణి ఇవాళ హైద‌రాబాద్‌లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి స‌మ‌క్షంలో ఆమె జ‌న జీవ‌న స్ర‌వంతిలో క‌లిసిపోయారు. ఈ సంద‌ర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ దండ‌కార‌ణ్యం డివిజ‌న‌ల్ క‌మిటీ సెక్ర‌ట‌రీగా ఉషారాణి అలియాస్ పోచ‌క్క ప‌ని చేశార‌న్నారు. అనారోగ్య కార‌ణాల‌తో ఆమె లొంగిపోయిన‌ట్టు డీజీపీ వెల్ల‌డించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తెనాలి ఉషారాణి స్వ‌స్థ‌లం. ఆమె తండ్రి ఆలూరి భుజంగ‌రావు. మ‌ద్రాస్ విశ్వ‌విద్యాల‌యంలో ఆమె ఎంఏ చ‌దివారు. 1980లో మావోయిస్టుల్లో చేరారు. దాదాపు నాలుగు ద‌శాబ్దాల పాటు మావోయిస్టు ఉద్య‌మంలో ఉషారాణి కీల‌కంగా ప‌ని చేశారు. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, గోండు త‌దిత‌ర మొత్తం ఆరు భాష‌ల‌పై ఆమెకు ప‌ట్టు వుంది. తండ్రి నుంచి ర‌చ‌నా వార‌స‌త్వాన్ని అందిపుచ్చుకున్నారు. జాతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పై కేడ‌ర్‌కు త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు.  

మావోయిస్టు ఉద్య‌మంలో ఉండ‌గానే క‌రీంన‌గ‌ర్‌కు చెందిన కామ్రేడ్ గొట్టిముక్క‌ల వెంక‌టేశ్వ‌ర్లును పెళ్లి చేసుకున్నారు. ఉద్య‌మ స‌హ‌చ‌రులుగా పేరు పొందారు. గ‌తంలో యాద‌గిరిగుట్ట పోలీస్‌స్టేష‌న్‌పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళుతూ పోలీస్ కాల్పుల్లో వెంక‌టేశ్వ‌ర్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే ఘ‌ట‌న‌లో ఉషారాణి త‌ప్పించుకున్నారు. ప్ర‌స్తుతం అనారోగ్య కార‌ణాల‌తో ఉద్య‌మం నుంచి బ‌య‌టికొచ్చారు.

ఉషారాణి తండ్రి ఆలూరి భుజంగ‌రావు విర‌సంలో క్రియాశీల‌కంగా ప‌ని చేశారు. ప్రేమ్‌చంద్‌, రాహుల్‌సాంకృత్యాయ‌న్‌, య‌శ్‌పాల్ త‌దిత‌ర ప్ర‌సిద్ధ ర‌చ‌యిత‌ల ర‌చ‌న‌ల‌ను తెలుగులోకి అనువదించారు. అలాగే ఆయ‌న స్వీయ ర‌చ‌న‌లు కూడా చేశారు. సాహిత్య కుటుంబానికి చెందిన ఉషారాణి ఇక‌పై జ‌నార‌ణ్యంలో ప్ర‌స్థానాన్ని సాగించ‌నున్నారు.